99 Corporation Posts Filled :రాష్ట్రంలో 20 కార్పోరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్లను కూటమి ప్రభుత్వం నియమించింది. తొలివిడతగా ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో బీసీ, ఎస్సీ, మైనార్టీ, ఎస్టీలకు పెద్ద పీట వేసింది. పౌరసరఫరాల శాఖ, పద్మశాలి సంక్షేమ, అభివృద్ధి కార్పొరోషన్లల్లో చెరో 15 మంది సభ్యులకు అవకాశమిచ్చింది. అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో 13 మంది సభ్యులను నియమించింది. ఏపీటీడీసీలో 10 మంది డైరెక్టర్లు, మార్క్ ఫెడులో ఆరుగురు, ట్రైకార్లో ఐదుగురు సభ్యులకు అవకాశమిచ్చింది. విత్తనాభివృద్ధి సంస్థలో ఇద్దరు, వినియోగదారుల రక్షణ మండలిలో ఒకరిని సభ్యులుగా నియమించింది.
కూటమి ప్రభుత్వం తాజాగా ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల్లో టీడీపీ అధిష్ఠానం అసలు సిసలైన కార్యకర్తలకు అగ్ర తాంబూలం ఇచ్చింది. తొలివిడతలో 11 మంది క్లస్టర్ ఇంఛార్జ్ లకు పదవులు లభించగా, అందులో ఒక క్లస్టర్ ఇంఛార్జ్ కు ఛైర్మెన్ పదవి వరించింది. వీరితోపాటు మరో ఆరుగురు యూనిట్ ఇంఛార్జ్‌లకు పదవులు లభించాయి. ప్రస్తుతం విడుదలైన కార్పోరేషన్ల ఛైర్మన్లు, సభ్యుల జాబితాలో జనసేనకు 12, బీజేపీకు 6 పదవుల కేటాయించారు. మిగిలిన కార్పోరేషన్లల్లోనూ సభ్యుల నియామకంపై కసరత్తు కొనసాగుతోంది.
మొత్తం పదవుల్లో 20 కార్పొరేషన్లకు ఛైర్మన్లు, ఒక కార్పొరేషన్ కు వైస్ ఛైర్మన్, వివిధ కార్పొరేషన్లు సభ్యులను కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ప్రకటించిన పదవుల్లో యువత కు ప్రాధాన్యత ఇచ్చారు. పార్టీ కోసం క్షేత్ర స్థాయిలో కష్టపడిన సామాన్య కార్యకర్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు పదవులు కట్టబెట్టారు. సామాజిక సమతూకం పాటిస్తూ సోషల్ ఇంజనీరింగ్ తో తొలి విడత ప్రకటించిన పదవులపై పార్టీ క్యాడర్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. రఘురామ కృష్ణంరాజు కోసం సీటు త్యాగం చేసిన అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజుకు కీలకమైన ఏపీఐఐసీ చైర్మన్ పదవి లభించింది.
మాజీ ఎంపీ, బీసీ నేత కొనకళ్ల నారాయణరావుకు కీలకమైన ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ పదవి లభించింది. అలాగే యువగళం పాదయాత్రలో వాలంటీర్స్ కోఆర్డినేటర్ గా పనిచేసిన అనిమిని రవి నాయుడుకు శాప్ చైర్మన్ పదవి, మంగళగిరిలో పార్టీ విజయం కోసం కృషి చేసిన సీనియర్ బీసీ నేత నందం అబద్దయ్యకు పద్మశాలి కార్పొరేషన్, ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి పీతల సుజాతకు వినియోగదారుల కౌన్సిల్ చైర్మన్, మాదిగ సామాజిక వర్గ ప్రముఖుడు పిల్లి మాణిక్యాలరావుకు లెదర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవులు లభించాయి. పొత్తు కారణంగా సీటు కోల్పోయిన అనకాపల్లికి చెందిన పేలా గోవింద్ సత్యనారాయణకు అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవితో న్యాయం చేశారు.