CM Chandrababu Direction to Ministers: సీఎం చంద్రబాబు.. గురువారం మంత్రివర్గ సమావేశం ముగిశాక అమాత్యులతో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. మదనపల్లిలో దస్త్రాలు కాల్చివేసిన ఘటనపై స్పందించాల్సిన బాధ్యత హోం, రెవెన్యూ మంత్రులదేనని.. ఇలా ఏ ఘటన జరిగినా సంబంధిత శాఖల మంత్రులే బాధ్యత తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై శాసనసభలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రంపైనా చర్చ జరిగింది. గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అరాచకాల్ని, వివిధ వర్గాలకు చెందినవారిని అక్రమ కేసులు, దాడులతో వేధించిన విధానాన్ని ప్రభావవంతంగా వివరించగలిగామని మంత్రులు అభిప్రాయపడ్డారు.
టీడీపీ నాయకులు, కార్యకర్తలు హింసాకాండకు పాల్పడినా సహించబోనని చంద్రబాబు చెప్పడాన్ని కొందరు ప్రస్తావించారు. సీఎం గట్టి హెచ్చరిక.. పార్టీ కేడర్‌ను కొంత భయపెట్టేలా ఉందన్న అభిప్రాయాన్ని ఒకరిద్దరు మంత్రులు వ్యక్తం చేసినట్లు తెలిసింది. వైఎస్సార్సీపీ నాయకులు తప్పు చేశారని, మనమూ అదే దారిలో వెళ్లడం సరికాదని, అందుకే అంత గట్టిగా చెప్పానని చంద్రబాబు స్పష్టంచేసినట్లు సమాచారం.
హంగు, ఆర్భాటాలు వద్దని, మనం చేసే పనుల వల్లే మనకు గుర్తింపు రావాలని సీఎం అన్నారు. ఏ అంశంలోనూ మితిమీరిన పెత్తనం వద్దని తేల్చిచెప్పారు. పరిపాలన ప్రక్రియలో మనం భాగస్వాములమే తప్ప సర్వం మనమే అన్నట్లుగా ఉండకూడదని సూచించారు. పింఛన్ల పంపిణీలో మంత్రులు విధిగా పాల్గొనాలి ఆదేశించారు. ఫలానా వాళ్లు మనకు ఓటు వేయలేదు కాబట్టి, పింఛను ఆపేస్తామనడం వంటివి చేయవద్దని దిశానిర్దేశం చేశారు. మౌలిక వసతుల కల్పన వంటి వ్యవహారాల్లో గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రస్తుత ప్రభుత్వానికి అంటగడుతూ జగన్ మీడియా దుష్ప్రచారం చేస్తున్నారన్న అంశం ప్రస్తావనకు వచ్చింది. అలాంటి వాటిని గట్టిగా తిప్పికొట్టాలని మంత్రులకు సీఎం సూచించారు.