CM Chandrababu on BJP victory in Delhi elections:ప్రధాని మోదీపై ఉన్న నమ్మకంతోనే దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిందని సీఎం చంద్రబాబు అన్నారు. దిల్లీ ఎన్నికల ఫలితాలపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. దిల్లీ ప్రజలు సరైన సమయంలో సరైన పార్టీని ఎన్నుకున్నారని అన్నారు. 1991 తర్వాత దేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయని వాటిని తెలుగుబిడ్డ పీవీ తీసుకువచ్చారని గుర్తుచేశారు. సంపద సృష్టిస్తేనే ఆదాయం పెరుగుతుందని మౌలిక వసతులు వస్తాయని అన్నారు. 1995-2024 మధ్య మన తలసరి ఆదాయం 9 రెట్లు పెరిగిందని వెల్లడించారు.
తెలుగు రాష్ట్రాల్లో 3000 డాలర్ల (సుమారు రూ.2.63 లక్షలు) తలసరి ఆదాయం ఉందని బిహార్‌లో తలసరి ఆదాయం ఇంకా 750 డాలర్లే (సుమారు రూ.65వేలు) ఉందని సీఎం తెలిపారు. టెక్నాలజీ సాయంతో మనం ముందుకెళ్లామని అంతేకాకుండా మనకు ఐటీ, మౌలిక వసతులు గేమ్‌ఛేంజర్‌గా మారాయని అన్నారు. రాష్ట్రాల్లో సుపరిపాలన ఇస్తే మంచి రాజకీయాలకు నాంది పలికినట్టేనని అన్నారు. చాలా రాష్ట్రాలను దాటుకుని గుజరాత్ తలసరి ఆదాయం పెరిగిందని స్థిరమైన పాలన, పాలసీలు, గ్రోత్ గుజరాత్ అభివృద్ధికి కారణమైందని అన్నారు. కొందరు నాయకులు సంక్షేమ కార్యక్రమాల పేరుతో అవినీతి చేస్తున్నారని ఇంక రాజకీయాల్లో కాలుష్యం పెరుగుతోందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఎక్కడ చూసినా చెత్తే:ఆప్ పాలనలో దిల్లీలో ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయిందని సీఎం అన్నారు. కొన్ని విధానాల వల్ల అత్యంత కాలుష్య నగరంగా దిల్లీ మారిందని తెలిపారు. ఏపీ, దిల్లీలో అమలు చేసిన పాలసీలకు విజయం దక్కలేదని అన్నారు. ప్రజల ఆకాంక్షలను వారు పట్టించుకోలేదని ఓటేసిన పాపానికి ప్రజల భవిష్యత్తును కాటేశారని అన్నారు. సంపద సృష్టించలేని, ప్రభుత్వానికి ఆదాయం పెంచలేని నేతలు ఎందుకని సీఎం ప్రశ్నించారు. ప్రజల జీవన ప్రమాణాలు, తలసరి ఆదాయం పెరుగుతూ ఉండాలని సూచించారు. ఏపీ, దిల్లీ ప్రజలు తప్పు తెలుసుకుని కష్టాల నుంచి బయటపడ్డారని అన్నారు. మంచి నాయకత్వంలో ముందుకెళ్తే 2047 నాటికి మన దేశమే నంబర్ వన్ అని సీఎం చంద్రబాబు అన్నారు.