Telangana Government on Policy for Hydra Demolitions :నగరంలో ఓ బడా నిర్మాణ సంస్థ బాచుపల్లిలో చెరువును ఆనుకొని ఎఫ్‌టీఎల్‌లోనే రెండు టవర్లను నిర్మించింది. దాదాపు అక్కడ 1000 మంది ఒక్కో ఫ్లాట్‌ను రూ.80 లక్షల నుంచి రూ.కోటిన్నర వరకు వెచ్చించి కొనుగోలు చేశారు. ఎఫ్‌టీఎల్‌లోనే ఈ ప్లాట్లు ఉన్నందున హైడ్రా చర్యలు చేపడితే, అందులో ఉంటున్న వారంతా రోడ్డున పడే అవకాశం ఉంది. మూసాపేటలోనూ ఓ నిర్మాణ సంస్థ ఏకంగా చెరువు ఎఫ్‌టీఎల్‌ను మార్చేసి అపార్ట్మెంట్ల నిర్మాణాన్ని దాదాపు పూర్తి చేసింది. ఇవే కాకుండా నగరంలో అక్రమ నిర్మాణాలు భారీగానే ఉన్నాయి. ఇందులో కొన్ని తప్పుడు పత్రాలతో అనుమతులు పొందారు.
హైడ్రా ఎఫెక్ట్! - రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయానికి గండి - రూ.300 కోట్లు లాస్
నిబంధనల ప్రకారం అయితే వీటిని హైడ్రా కూల్చివేయాల్సిందే. ఒకవేళ ఇదే జరిగితే ఎన్నో ఏళ్ల కింద కొనుగోలు చేసిన సామాన్యులు రోడ్డునపడతారు. ఈ నేపథ్యంలో ఇలాంటి నిర్మాణాల కూల్చివేతల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుందనే ఆలోచనలో హైడ్రా అధికారులున్నారు. బాధితులకు బిల్డర్ల నుంచి పరిహారం ఇప్పించాలని భావిస్తున్నట్లు సమాచారం. రెండ్రోజుల కిందట హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఇదే విషయాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వివరించారు. దీంతో సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించాలని భట్టి నిర్ణయించారు. ఈ నేపథ్యంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతపై త్వరలో రాష్ట్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోనుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.