Chevella Lok Sabha Election Fight 2024 :రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లోక్‌సభ ఎన్నిక ఈసారి రసవత్తరంగా ఉండబోతుంది. ప్రధాన పార్టీలు బలమైన అభ్యర్థులను రంగంలోకి దించడంతో త్రిముఖపోటీ నెలకొంది. అధికార కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి సతీమణి, వికారాబాద్ జిల్లా జెడ్పీఛైర్‌పర్సన్ నీతా మహేందర్ రెడ్డి పేరు దాదాపుగా ఖాయమైంది. ఆమె పేరు కాంగ్రెస్(Congress) అధికారికంగా ఖరారు ప్రకటించాల్సి ఉంది.
ఇప్పటికే కుదిరిన ఒప్పందం మేరకు సునీతారెడ్డి కుటుంబం ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి హస్తం పార్టీలో చేరింది. తొలి జాబితాలో ఆమె పేరు ఉన్నా చివరి క్షణంలో పెండింగ్‌లో పెట్టారు. క్షేత్రస్థాయిలో ఆమె ప్రచారాన్ని మొదలుపెట్టారు. మాజీ మంత్రి మహేందర్ రెడ్డి సతీమణిగానే కాకుండా క్షేత్రస్థాయిలో మంచిపేరు, గుర్తింపు సహా గత పరిచయాలు కలిసివస్తాయని నేతలు చెబుతున్నారు.
బీఆర్ఎస్ నుంచి బరిలో కాసాని : సిట్టింగ్ ఎంపీ రంజిత్‌రెడ్డి మరోసారి పోటీకి ఆసక్తి చూపకపోవడంతో అభ్యర్థి కోసం బీఆర్ఎస్ నాయకత్వం పలుపేర్లు పరిశీలించింది. గతంలో అక్కడ నుంచి పోటీపడిన అనేక మంది సీనియర్లు మారిన రాజకీయ పరిస్థితులతో వెనకడుగు వేశారు. చివరకు తర్జనభర్జనపడి మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ పేరును బీఆర్ఎస్ ఖరారు చేసింది. కాంగ్రెస్, టీడీపీలలో పలు హోదాల్లో కాసాని పని చేశారు.
బాచుపల్లిలో సాధారణ కార్యకర్తగా మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం రాష్ట్రస్థాయి వరకు సాగింది. గతేడాది టీడీపీ(TDP) రాజీనామా చేసి కేసీఆర్ సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు. జిల్లాలో బలమైన సామాజిక వర్గం ఉండటంతో కాసాని వైపు బీఆర్ఎస్ మొగ్గు చూపింది. ఆయన్ని గెలిపించే బాధ్యతను మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీసుకున్నట్లు తెలుస్తోంది.
"బీజేపీ నలుమూలలకు పోయింది. నరేంద్ర మోదీ నలుమూలలకు పోయారు. అన్ని స్థాయిల నాయకులు కూడా ఇది మోదీ వర్సెస్ రాహుల్ గాంధీ అని అంటున్నారు. మోదీకి చేవెళ్ల గ్యారంటీ, చేవెళ్లకు మోదీ సీటు గ్యారంటీ. ప్రజలందరికీ మోదీపై విశ్వాసం వచ్చింది. ఈసారి బీజేపీ అధికారంలోకి వస్తుంది."- కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి