Chandrababu with MLA Contest Candidates: తెలుగుదేశం తొలి జాబితాలో సీట్లు పొందిన అభ్యర్థుల పని తీరు బాగోకుంటే మార్చేందుకు ఎంత మాత్రం వెనకాడనని అధినేత చంద్రబాబు హెచ్చరించారు. 94 మంది అభ్యర్థులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు ప్రతీ వారం పనితీరు పర్యవేక్షిస్తానని స్పష్టం చేశారు. ఎన్నికల వరకు ప్రతి వారం రోజులకు ఓ సర్వే చేస్తానని తేడా వస్తే వేటు తప్పదని తేల్చి చెప్పారు.
రెండు పార్టీల నేతలు సమన్వయంతో పనిచేస్తే 100 శాతం ఓట్ల బదిలీ జరుగుతుందన్నారు. వైసీపీ నేతలు పార్టీలోకి వస్తే ఆహ్వానించాలని తెలిపారు. జగన్ తన పాలనను నమ్ముకోలేదని, దౌర్జన్యాలు, అక్రమాలు, దొంగ ఓట్లు, డబ్బును నమ్ముకున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఊహించని స్థాయిలో జగన్ కుట్రలు కుతంత్రాలు చేస్తారని అన్నింటికీ సిద్దంగా ఉండాలన్నారు.
వచ్చే 40 రోజులు అత్యంత కీలకమన్న చంద్రబాబు ప్రభుత్వ విధానాలతో పాటు స్థానిక ఎమ్మెల్యేల పనితీరును ఎండగట్టేలా కార్యక్రమాలు రూపొందించుకోవాలని సూచించారు. జనసేన నేతలతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికలకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రజల భవిష్యత్ కోసం తెలుగుదేశం-జనసేన కలిశాయని, రాష్ట్ర ప్రయోజనాలే ప్రధానంగా, గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక జరిగిందని చెప్పారు.
గతంలో ఎప్పుడూ ఇంత ముందుగా అభ్యర్థుల ప్రకటన జరగలేదని గుర్తుచేశారు. పార్టీ అభ్యర్థులకు సైతం ప్రజల మద్దతు, ఆమోదం ఉండాలని కొత్త విధానం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేశానని తెలిపారు. ఎవరైనా అసంతృప్తితో ఉంటే స్వయంగా వెళ్లి కలవాలని సూచించారు. తటస్థులను కలిసి రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని వివరించి మద్దతు కోరాలన్నారు. కోటి మందికిపైగా అభిప్రాయాలు తీసుకుని సర్వేలు పరిశీలించి, సుదీర్ఘ కసరత్తు చేసి అభ్యర్థుల ఎంపిక చేశానని వివరించారు.