Chandrababu Pawan Kalyan Praja Galam:ప్రజాగళం సభల్లో భాగంగా విజయనగరం, నెల్లిమర్లలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో ఉమ్మడిగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఐదేళ్లుగా జగన్ ఉత్తరాంధ్ర ప్రజల్ని నమ్మించి నట్టేట ముంచారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఒక్క సాగు నీటి ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని మండిపడ్డారు.
జగన్‌ను తరిమికొట్టాలి: కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, తారకరామతీర్థ సాగర్ పెండింగ్ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. భోగాపురం విమానాశ్రయాన్ని 2025 కల్లా పూర్తి చేస్తామన్నారు. నెల్లిమర్ల అతిపెద్ద ఇండస్ట్రియల్ హబ్‌గా తయారవుతుందన్నారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ఏదో నాటకం ఆడటం జగన్‌కు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. ఉత్తరాంధ్రలో అభివృద్ధి లేకుండా చేసిన జగన్‌ను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
చిరంజీవిలాంటి సినీ నటులనూ వదల్లేదు: ఉద్యోగులు, పోలీసులనూ జగన్ వంచించారని చంద్రబాబు ఆక్షేపించారు. కూటమి వస్తేనే వారికి న్యాయం జరుగుతుందన్నారు. జగన్ కక్ష రాజకీయాలకు ఎంతో మంది బలయ్యారన్న చంద్రబాబు తల్లినీ చెల్లినీ సైతం వేధించారని మండిపడ్డారు. చిరంజీవిలాంటి సినీ నటులనూ వదల్లేదన్నారు.
జగన్ ఉత్తరాంధ్ర ద్రోహి - ఈ సారి డిపాజిట్లు కూడా రావు: చంద్రబాబు - Chandrababu Speech
జగన్ సభలకు రావాలంటే రూ.500 నోటు, క్వార్టర్ బాటిల్ ఇస్తున్నా జనం రాని పరిస్థితి ఉందని చంద్రబాబు ఆరోపించారు. తాను సీఎంగా ఉంటే ఈపాటికే ఉత్తరాంధ్రకు భోగాపురం ఎయిర్ పోర్టు వచ్చేదని, కానీ వైసీపీ పాలన కారణంగా ఇప్పటికీ రాలేదని విమర్శించారు. 2 వేల 750 ఎకరాలతో భూసమీకరణ చేసి శంకుస్థాపన చేస్తే జగన్ వచ్చాక దానికి మరోసారి శంకుస్థాపన చేస్తాడు గానీ పని మాత్రం పూర్తి చేయరని ఎద్దేవా చేశారు.
జగన్‌కు, పవన్ కల్యాణ్‌కు చాలా తేడా ఉంది: జగన్ అహంకారంతో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారన్న చంద్రబాబు, ప్రతి ఒక్కరూ ఆయన కింద బానిసలుగా బతకాలా అంటూ ప్రశ్నించారు. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం వచ్చిన వ్యక్తి పవన్ కల్యాణ్ అని అన్నారు. ఆయన సినిమాలు తీసుకుంటే విలాసవంతంగా ఉండేవారని, కానీ ప్రజల కోసం ముందుకు వచ్చారని తెలిపారు. జగన్‌కు, పవన్ కల్యాణ్‌కు చాలా తేడా ఉందని పేర్కొన్నారు.