రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదు - సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నిక ఇది: చంద్రబాబు (ETV Bharat) Chandrababu Naidu on NDA Victory: కూటమి ఘన విజయంపై ప్రజలకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. మీడియా సహా రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. శిరస్సు వంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ప్రజలతోపాటు మీడియాకు స్వాతంత్ర్యం వచ్చింది అంటూ ఫలితాలపై మీడియా సమావేశంలో మాట్లాడారు. తన సుదీర్ఘ రాజకీయ యాత్రలో ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదన్న చంద్రబాబు, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఎలా ఇబ్బంది పడ్డాయో చూశామని పేర్కొన్నారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలన్నదే మా ధ్యేయమన్నారు. ఎన్ని త్యాగాలు చేసైనా భావితరాల భవిష్యత్తు కోసం ముందుకెళ్లామన్నారు.
రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదని, దేశం, ప్రజాస్వామ్యం, రాజకీయ పార్టీలు మాత్రమే శాశ్వతమని చంద్రబాబు తెలిపారు. రాజకీయ పార్టీలు కూడా సక్రమంగా పనిచేస్తే మళ్లీ ప్రజలు ఆదరిస్తారని రుజువు చేశాయన్నారు. ఇంత చరిత్రాత్మకమైన ఎన్నికలు ఎప్పుడూ చూడలేదన్న చంద్రబాబు, ఎక్కడో అమెరికాలో ఉండే వ్యక్తి కూడా తపనతో వచ్చి పనిచేశారని అన్నారు. పక్క రాష్ట్రాల్లో కూలీ పనులకు వెళ్లిన వ్యక్తులు కూడా వచ్చి ఓటు వేశారని, టీడీపీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నిక ఇదని పేర్కొన్నారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు 1983లో 200 సీట్లు వచ్చాయని, మళ్లీ ఇప్పుడు ఊహించనివిధంగా ఫలితాలు వచ్చాయన్నారు.
పసుపు దళానికి అతడే ఒకసైన్యం - రాజకీయచాణక్యంతో మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రుడు - chandrababu naidu strong comeback
కార్యకర్తల త్యాగాల ఫలితమే: కాలిన కడుపులతో ప్రజలు చూపిన అంకిత భావాన్ని ఎలా వర్ణించాలో అర్ధంకావట్లేదని అన్నారు. గత ఐదేళ్లల్లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని తన జీవితంలో చూడలేదన్న ఆయన, అన్ని వ్యవస్ధలను ధ్వంసం చేశారని దుయ్యబట్టారు. ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే వ్యక్తులు, రాజకీయ పార్టీలు కనుమరుగు అవుతాయని ప్రజలు చాటి చెప్పారన్నారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి నినాదంతోనే పనిచేశామన్న చంద్రబాబు, కూటమికి 55.38 శాతం ఓట్లు వచ్చాయని, 45.60 శాతం టీడీపీకి, 39.37 శాతం వైఎస్సార్సీపీకి వచ్చాయన్నారు.
అవినీతి, అరాచకాలతో పనిచేస్తే ఇలాంటి గతే పడుతుందని, ఐదేళ్లు టీడీపీ కార్యకర్తలు చాలామంది ఇబ్బందిపడ్డారని గుర్తు చేసుకున్నారు. కార్యకర్తలకు కంటినిండా నిద్ర కూడా పోని పరిస్థితని, ప్రాణాలతో ఉండాలంటే జై జగన్ అనాలని హింసించారని ధ్వజమెత్తారు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు అంటూ ప్రాణాలొదిలిన పరిస్థితి చూశామన్న చంద్రబాబు, కార్యకర్తల త్యాగాల ఫలితమే ప్రజాస్వామ్యాన్ని కాపాడిందన్నారు.
పడిలేచిన కెరటం - ఏపీ ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభంజనం - ap elections 2024
జగన్ పాలన ఓ కేస్ స్టడీ: ఐదేళ్లు మీడియా కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొందన్న చంద్రబాబు, ప్రజాస్వామ్యమే సిగ్గుతో తలొంచుకునే ఘటనలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరినైనా, ఏదైనా చేయవచ్చని దాడులు చేశారని, విశాఖకు వెళ్తే పవన్ కల్యాణ్‌ను వెనక్కి పంపించేశారని, ఎవరైనా కేసులు ఎందుకు పెట్టారని అడిగితే అరెస్టు చేశారని అన్నారు.
రాజకీయాల్లో ఎలాంటి వ్యక్తులు ఉండకూడదు, ఎలాంటి వారు రాకూడదో జగన్ పాలన ఓ కేస్ స్టడీ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పాలకులు ఎలా ప్రజా సేవ చేయాలో చాలా మందిని చూసామన్న ఆయన, పాలకుడు ఎలా ఉండకూడదో జగన్ ఒక్కడే చేసి చూపించాడన్నారు. ఐదేళ్ల పాలనలో ఏపీ 30 ఏళ్ల వెనక్కు వెళ్లేలా విధ్వంసం జరింగిందని మండిపడ్డారు. అప్పులు ఎంతున్నాయో చూడాలని, సహజ సంపద దోపిడీ యథేచ్ఛగా జరిగిందని ఆరోపించారు. వ్యవస్థలన్నింటినీ పునరుద్ధరించాల్సి ఉంటుందని తెలిపారు. నాశనం చేసిన వ్యవస్థలను బాగు చేయాలంటే చాలా కష్టపడాలన్నారు.
పంతం నెగ్గించుకున్న చంద్రబాబు - ఆనందోత్సాహాల్లో టీడీపీ శ్రేణులు - CBN Again CM
చెప్పినట్టుగా గెలిచి అసెంబ్లీకి వెళ్తున్నాం: గతంలో విద్యుత్ సంక్షోభం ఉండేదని, సంస్కరణలు తెచ్చి గాడిలో పెట్టామని తెలిపారు. ఇప్పుడు మళ్లీ విద్యుత్ సంక్షోభం ఉందని అన్నారు. గత ప్రభుత్వం 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచిందని, ఎందుకు పెంచారో కూడా తెలీదని మండిపడ్డారు. తన మీద బాంబులతో దాడి చేసినప్పుడు కూడా బాధ పడలేదని, భయపడలేదన్న చంద్రబాబు, కానీ అసెంబ్లీలో తనను, తన కుటుంబ సభ్యులను అవమానించారని ఆవేదన వ్యక్తంచేశారు.
తాము పాలకులం కాదు, సేవకులం: అందుకే కౌరవ సభగా ఉన్న అసెంబ్లీని గౌరవ సభ చేశాకే వస్తానన్నానని చెప్పినట్టుగా గెలిచి అసెంబ్లీకి వెళ్తున్నామని, అందుకు సంతోషంగా ఉందన్నారు. ఓడినప్పుడు కుంగిపోలేదని, గెలిచినప్పుడు గంతులేయలేదని చంద్రబాబు తెలిపారు. ఓటేశాం మా పని అయిపోయిందని ప్రజలు భావించవద్దన్న చంద్రబాబు, మమ్మల్ని నడిపించే బాధ్యత కూడా ప్రజలు తీసుకోవాలని కోరుతున్నానన్నారు. తాము పాలకులం కాదని, సేవకులుగా పనిచేస్తామని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
సమష్టి కృషితోనే అనూహ్య విజయం: తమ మేనిఫెస్టో ప్రజల్లోకి బలంగా వెళ్లిందని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడానికి వీళ్లేదని పవన్ పట్టుబట్టారన్న చంద్రబాబు, రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని పవన్ కృషిచేశారని కొనియాడారు. పవన్‌తో పాటు కూటమిలో బీజేపీ కూడా భాగస్వామ్యమైందని, ఎలాంటి పొరపాటు లేకుండా ముగ్గురం కలిసి పనిచేశామని తెలిపారు. ఎన్డీయేలో భాగస్వాములుగా బాధ్యతతో ముందుకెళ్లామన్న చంద్రబాబు, సమష్టి కృషితోనే అనూహ్య విజయాన్ని సాధించగలిగామని పేర్కొన్నారు.
ఏపీలో ఎదురులేని కూటమి - విశ్వరూపం చూపించిన చంద్రబాబు - super hit combo