TDP, Janasena, BJP MLA Candidates Change: ఉండవల్లిలోని టీడీపీఅధినేత చంద్రబాబు నివాసంలో సుమారు రెండు గంటలపాటు జరిగిన భేటీలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్, సిద్ధార్థనాథ్‌సింగ్ పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు మూడు పార్టీలూ ఇప్పటికే అభ్యర్థుల్ని ప్రకటించేశాయి. వాటిలో కొన్ని మార్పులపై ఈ సమావేశంలో చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలిసింది.
టీడీపీ శ్రేణుల డిమాండ్:అనపర్తి సీటు మార్పుతో పాటు, ఎంపీ రఘురామకృష్ణరాజును ఎక్కడి నుంచి పోటీ చేయించాలన్న అంశంపైనా చర్చ జరిగింది. అనపర్తి నియోజకవర్గానికి టీడీపీ మొదటి జాబితాలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిను అభ్యర్థిగా ప్రకటించింది. తర్వాత పొత్తులో భాగంగా ఆ సీటు బీజేపీకి వెళ్లింది. కానీ రామకృష్ణారెడ్డినే కొనసాగించాలని స్థానిక టీడీపీ శ్రేణులు గట్టిగా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో టీడీపీ విజ్ఞప్తి మేరకు, అనపర్తి సీటు వదులుకునేందుకు బీజేపీ సిద్ధమైంది. దానికి బదులుగా ఉంగుటూరు అసెంబ్లీ స్థానం తమకు కేటాయించాలని ఆ పార్టీ నాయకులు కోరారు. కానీ ఉంగుటూరు సీటును ఇప్పటికే జనసేనకు కేటాయించినందున, బీజేపీకి ఇవ్వలేమని చంద్రబాబు స్పష్టం చేశారు.
నరసాపురం లోక్‌సభ స్థానం: అనపర్తికి బదులు తంబళ్లపల్లె తీసుకోవాలని ప్రతిపాదించగా, తమ అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లి నిర్ణయం చెబుతామని బీజేపీ నాయకులు అన్నట్లు తెలిసింది. నరసాపురం లోక్‌సభ స్థానాన్ని తమకు విడిచి పెట్టాలని, అక్కడి నుంచి రఘురామకు టికెట్ ఇస్తామని చంద్రబాబు ప్రతిపాదించి, దానికి బదులుగా ఉండి అసెంబ్లీ స్థానాన్ని తీసుకుని, ప్రస్తుతం నరసాపురం లోక్‌సభ స్థానం కేటాయించిన శ్రీనివాసవర్మకు ఆ సీటు కేటాయించాలని సూచించినట్లు తెలిసింది. ఆ ప్రతిపాదనను అధిష్ఠానం దృష్టికి తీసుకెళతామని బీజేపీ నాయకులు చెప్పారని సమాచారం.