CHANDRABABU COMMENTS ON HYDERABAD: హైదరాబాద్ ఒక్క తెలంగాణది మాత్రమే కాదని, తెలుగు ప్రజలదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్ అభివృద్ధిని చూసి తాను గర్వపడతున్నానని పేర్కొన్నారు. సృష్టించిన సంపదను ఎవరూ ధ్వంసం చేయాలని అనుకోరని, అయితే కొందరు వికృతంగా ఆలోచించి అలాంటి పనులు చేస్తారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందితే అది దేశాభివృద్ధికే చెందుతుందని చంద్రబాబు అన్నారు. షిప్ బిల్డింగ్ కోసం ఏపీలో చాలా అవకాశాలు ఉన్నాయని, కొన్ని ప్రోత్సాహకాలు ఇస్తే చాలా పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్‌కి వస్తాయని స్పష్టం చేశారు. కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం జిందాల్‌తో చర్చించానని తెలిపారు. త్వరలో ఆంధ్రప్రదేశ్‌కి వచ్చి ప్లాంట్ గురించి ప్రభుత్వంతో మాట్లాడతానని ఆయన చెప్పినట్లు పేర్కొన్నారు. అదే విధంగా విజయసాయి రెడ్డి విషయం గురించి కూడా స్పందించారు. విజయసాయి రాజీనామా వారి అంతర్గత వ్యవహారమని, వైఎస్సార్సీపీ నాయకత్వంపై విశ్వాసం లేకపోతే పార్టీని కొందరు వీడి వెళ్లిపోతారని అన్నారు.
Chandrababu On Banakacherla Project: అదే విధంగా బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభ్యంతరాలపై కూడా చంద్రబాబు స్పందించారు. గోదావరి నీళ్లు బనకచర్లకు తరలిస్తే తెలంగాణకు ఎలాంటి నష్టం లేదని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గోదావరి వరద జలాలను మాత్రమే తరలించాలని భావిస్తున్నామని అన్నారు. నదీ ప్రవాహానికి సంబంధించినంత వరకూ తెలంగాణ ఏపీకి ఎగువ రాష్ట్రమని తెలిపారు. గోదావరిపై తెలంగాణ రాష్టం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినప్పుడు తాము అభ్యంతరం చెప్పలేదని చంద్రబాబు గుర్తు చేశారు.