Cases on YSRCP Gifts Incident in Renigunta : తిరుపతి జిల్లా రేణిగుంట, గాజులమండ్యం గిడ్డంగుల్లో వైసీపీ తాయిలాల ఘటనపై పోలీసులు కేసులు నమోదు చేసారు. కాగా రెండు రోజులు క్రితం గొడౌన్లలో పెద్ద మొత్తంలో తాయిలాలు బయటపడ్డాయి. దీంతో గిడ్డంగి ఇన్‌ఛార్జ్, సెక్యూరిటీ గార్డు సహా నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్టాక్ బుకింగ్ ఇన్‌ఛార్జ్ సుమన్, కాపలాదారులు అనిల్, రమేశ్ రెడ్డి, గిడ్డంగి ఇన్‌ఛార్జ్ రవికుమార్‌లపై కేసులు నమోదయ్యాయి.
వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు : గిడ్డంగుల్లో ఇటీవల జగన్ చిత్రంతో ఉన్న వాచీలు, బొట్టుబిళ్లలు, గొడుగులు, సౌండ్ సిస్టమ్‌లు, చీరలు స్వాధీనం చేసుకున్నారు. దీంతో వారిపై 188, 171, 123, 171ఈ, 171 ఎఫ్ కింద కేసులు నమోదు చేశారు. అయితే ఎఫ్‌ఐఆర్‌లో మాత్రం వైసీపీ నేతల పేర్లను రేణిగుంట పోలీసులు చేర్చకపోవడం గమనార్హం.
ఎన్నికల వేళ వైసీపీ కుట్రలు బట్టబయలు - ఓటర్లకు పంచనున్న చీరలు పట్టివేత - EC SEIZED YSRCP GIFTS
ఇంతకీ ఏం జరిగిందంటే : ఎన్నికల్లో లబ్ధి పొందడానికి తాయిలాలు పంపిణీ చేస్తోన్న వైసీపీ శ్రేణులు అందుకు తిరుపతి జిల్లా రేణిగుంటను కేంద్రంగా ఎంచుకున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే, ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి కుటుంబానికి చెందిన గోడౌన్ నుంచి సామగ్రిని సరఫరా చేస్తున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు తరలించగా మార్చి 26వ తేదీన మిగిలిన వాటిని తీసుకెళ్లే క్రమంలో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారికి సమాచారం అందింది.
దీంతో వాటిని తీసుకెళ్తున్న లారీని పట్టుకున్నారు. ఇదే సమయంలో అక్కడే ఉన్న గోదాంలో భారీఎత్తున సామగ్రితోపాటు డబ్బులు ఉంచినట్లు తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి నరసింహయాదవ్‌తో పాటు కార్యకర్తలు ఆరోపించారు. వెంటనే గోడౌన్ తెరవాల్సిందిగా డిమాండ్ చేశారు. పంచనామా నిర్వహించేందుకు అధికారులు రేణిగుంట తహసీల్దారుకు సమాచారాన్ని ఇచ్చినా, సుమారు అయిదు గంటల తరువాత ఆయన అక్కడికి చేరుకున్నారు. ఎట్టకేలకు రాత్రి 8 గంటల సమయంలో గోడౌన్‌ను తెరిచారు.
పెద్ద మొత్తంలో పట్టుబడ్డ తాయిలాలు :గోడౌన్లో మొత్తం వివిధ వస్తువులను అధికారులు గుర్తించారు. ఓటర్లకు ఇచ్చేందుకు బొట్టు బిళ్లలు, ఫొటో కీచైన్లు, చేతి గడియారాలు, సెల్‌ఫోన్ స్టాండ్లు, టీషర్టులు, గొడుగులు, చీరలు, మైక్‌సెట్లు వంటివి ఉన్నాయి. వీటితోపాటు సీఎం జగన్ మోహన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మోహిత్‌రెడ్డిల ఫొటోలున్న సంచులు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. కొంతమేర వైసీపీ ఎన్నికల ప్రచార సామగ్రి కూడా ఈ గొడౌన్లో లభించింది. ఏ నియోజకవర్గానికి ఏయే తేదీల్లో తాయిలాలు పంపించారనే వివరాలు సైతం ఒక పుస్తకంలో నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు చేసిన అధికారులు తాజాగా నలుగురిపై కేసు నమోదు చేశారు.
పట్టుబడ్డ వైఎస్సార్సీపీ ప్రచార సామగ్రి గుట్టు విప్పండి - టీడీపీ నేతల ఫిర్యాదు - YCP LEADERS ELECTION GIFTS