KTR Notice to Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. తనపై కొండా సురేఖ చేసిన ఆరోపణలను ఖండించిన ఆయన, తన గౌరవానికి, ప్రతిష్ఠకు భంగం కలిగించాలన్న లక్ష్యంతోనే అడ్డగోలు వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం తన పేరును వాడుకుంటున్నారని అన్నారు. ఒక మహిళ అయి ఉండి మరో మహిళ పేరుతో పాటు సినిమా నటుల పేర్లను వాడుకొని వారి వ్యక్తిత్వ హననానికి పాల్పడడం దురదృష్టకరమన్నారు.
ఎలాంటి సాక్ష్యాధారాలు లేని కొండా సురేఖ అసత్యపూరిత వ్యాఖ్యలు మీడియా, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అయ్యాయన్న కేటీఆర్, ఈ పరిణామాల వల్ల సాధారణ ప్రజలు మంత్రి వ్యాఖ్యలను నిజాలుగా భ్రమపడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలోనూ ఆమె ఇలా మాట్లాడినందుకే ఏప్రిల్‌లో నోటీసులు పంపించానన్నారు. మంత్రి కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
24 గంటల్లోగా క్షమాపణ చెప్పకుంటే చట్టప్రకారం పరువు నష్టం దావాను వేయడంతో పాటు క్రిమినల్ కేసులు పెడ్తానని హెచ్చరించారు. అయితే సినీనటుడు నాగార్జున కుటుంబంలో చోటు చేసుకున్న పరిస్థితులకు కేటీఆర్ కారణమని కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఈ మేరకు లీగల్ నోటీసులు పంపారు. అలాగే తనకు సంబంధమే లేని ఫోన్ ట్యాపింగ్‌పై అసత్యాలు మాట్లాడారని ఆక్షేపించారు.
వ్యక్తిగత విషయాలను గౌరవించండి : మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను ఎక్స్ వేదికగా సినీ నటుడు నాగార్జున తీవ్రంగా ఖండించారు. మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు మమ్మల్ని వాడుకోవద్దని చెప్పారు. రాజకీయాలకు దూరంగా ఉన్న సినీ ప్రముఖుల జీవితాలను గౌరవించండని తెలిపారు. సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించాలని సూచించారు. బాధ్యత గలిగిన పదవిలో ఉన్న కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సరికాదని వ్యాఖ్యానించారు. తమ కుటుంబంపై మీ ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధమని పేర్కొన్నారు. తక్షణమే కొండా సురేఖ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నట్లు నాగార్జున ట్వీట్ చేశారు.
ఇంతకీ కొండా సురేఖ ఏమన్నారంటే? :బీసీ మహిళనైన తనపై అసభ్యకర పోస్టులు పెట్టడం బాధాకరమని కొండా సురేఖ ఆవేదనకు లోనయ్యారు. మహిళలను కించపరిచేలా పోస్టులు పెట్టాలని కేటీఆరే ఆ పార్టీ కార్యకర్తలకు చెప్పినట్లు ఉందని ఆరోపించారు. మంత్రి సీతక్క, మేయర్ గద్వాల విజయలక్ష్మిపై అసభ్యకర పోస్టులు పెట్టారని విమర్శించారు. ఐదేళ్లు బీఆర్ఎస్లో పనిచేశానని చెప్పారు. తన వ్యక్తిత్వం అందరికీ తెలుసని పేర్కొన్నారు. అసభ్యకరంగా పోస్టులు పెట్టినవారిపై ఫిర్యాదు చేశామని తెలిపారు. రాజకీయ విలువలు దిగజారిపోయాయని అన్నారు. ప్రభుత్వం తప్పు చేస్తే ఎత్తిచూపాలని వ్యక్తిత్వం దెబ్బతీసేలా ప్రవర్తించవద్దని హితవు పలికారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా నుంచి అసభ్యకరమైన పోస్టులు వస్తే ఊరుకునేలేదని కొండా సురేఖ హెచ్చరించారు.
సమంత విడాకులకు కేటీఆరే కారణమన్న మంత్రి కొండా సురేఖ - నాగార్జున రియాక్షన్ ఇదే - ఏమని ట్వీట్ చేశారంటే!
సమంత, నాగ చైతన్య విడిపోడానికి కేటీఆరే కారణం - కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు