BRS MP Candidates Reaction on Parliament Elections 2024 : లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు గులాబీదళం సన్నద్ధం అయ్యింది. అందులో భాగంగా లోక్‌సభ ఎన్నికలకు భారత రాష్ట్ర సమితి మొదటి జాబితాను ప్రకటించింది. నాలుగు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. కరీంనగర్ నుంచి బి.వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఖమ్మం నుంచి నామ నాగేశ్వర రావు, మహబూబాబాద్ నుంచి మాలోత్ కవిత బరిలో దిగనున్నారు. గత రెండు రోజులుగా ఆయా లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలతో చర్చించి, సమష్టి నిర్ణయం ప్రకారం ఏకగ్రీవంగా ఎంపికైన నలుగురు అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. పార్టీ అభ్యర్థులకు అధినేత శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా శాసనసభ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చినా, లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయని ఆ పార్టీ ఖమ్మం, మహబూబాబాద్ అభ్యర్థులు నామ నాగేశ్వర రావు, మాలోత్ కవిత తెలిపారు. మరోమారు లోక్ సభకు పోటీ చేసే అవకాశం కల్పించినందుకు అధినేత కేసీఆర్, నేతలకు ధన్యవాదాలు చెప్పారు. పాతికేళ్లుగా ప్రజాసేవలో ఉన్నానన్న నామ, అంతకు ముందు నుంచి కూడా సేవ చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాహుల్ గాంధీ, ఎవరైనా పోటీ చేసినా ఎదుర్కొంటానన్న ఆయన, గెలుపు ఓటములు కాదు, ప్రజా సేవ ముఖ్యమని వ్యాఖ్యానించారు.
లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన కేసీఆర్ - ఫస్ట్ లిస్ట్‌లో వీరికే ఛాన్స్
లోక్‌సభ ఎన్నికల కోసం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు అనుకూల ఫలితాలు వస్తాయి. రాహుల్ గాంధీ కాదు, ఎవరు పోటీ చేసినా ఎదుర్కొంటా. బీఆర్‌ఎస్ అభ్యర్థులకు ప్రజలు మద్దతు ఇవ్వాలి. - నామ నాగేశ్వర రావు, ఖమ్మం లోక్‌సభ అభ్యర్థి