BRS MLA Candidate Niveditha Bypoll Campaign in Cantonment : కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీజేపీ నాటకాలను ప్రజలు ఎవరూ నమ్మరని బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మోండా మార్కెట్ డివిజన్ పరిధిలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంక్షేమ పథకాల బీఆర్ఎస్ పార్టీకే కంటోన్మెంట్ ప్రజలు మద్దతు పలకాలని అభ్యర్థి నివేదిత కోరారు.
కాంగ్రెస్ పాలనలో నిరుపేదలను పట్టించుకోవడం లేదని రేవంత్ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు గ్యారంటీల పేరుతో హడావిడి చేయడం తప్ప, వాటి అమలుపై దృష్టి పెట్టడం లేదని ధ్వజమెత్తారు. అందుకే కాంగ్రెస్, బీజేపీలతో ఇక్కడి ప్రజలకు ఎలాంటి లాభం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ కోసం రాజీ లేకుండా పోరాటం చేసే సత్తా కేవలం గులాబీ పార్టీకే ఉందని చెప్పారు. దివంగత ఎమ్మెల్యే సాయన్న చేసిన అభివృద్ధి పనులు ఇప్పటికీ ప్రజల ముందు ఉన్నాయని నివేదిత పేర్కొన్నారు. అందుకే అభివృద్ధి తమ నినాదం అని, ఈసారి ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రచారానికి జనమంతా జేజేలు పలికారు. శాలువలు, పూలమాలలతో నివేదితను సత్కరించి, తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఎమ్మెల్యే లాస్య నందిత మృతి కేసు - ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొనడంతోనే ప్రమాదం!
సాయన్న కుమార్తె వెంటే కంటోన్మెంట్ ప్రజలు : గులాబీ పార్టీ వెన్నంటే ఉంటామని, సాయన్న కుమార్తెను గెలిపించుకుంటామని స్థానికులు ప్రతిన బూనారు. ఈ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ అధ్యక్షులు ఆకుల హరి, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ టీఎన్ శ్రీనివాస్‌తో పాటు సీనియర్ నాయకులు నరసింహ ముదిరాజ్, దాసరి కర్ణకుమార్, సృజన్, వినయ్, నారాయణ, రాము, జోడీ బ్రదర్స్, మహిళా నాయకులు పాల్గొన్నారు.