BRS Leaders Letter to Speaker on Protocal Issue : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేల హక్కులను కాలరాసే విధంగా కొత్త సంస్కృతిని తీసుకొచ్చిందని, కావాలనే విపక్ష ఎమ్మెల్యే హక్కులకు భంగం కలిగిస్తోందని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. ప్రొటోకాల్ ఉల్లంఘనలకు సంబంధించి ఆయన శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్‌కు లేఖ రాశారు. ప్రతి సందర్భంలో ప్రొటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడుతూ, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించటం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని, ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి సంప్రదాయం ఎంత మాత్రం మంచిది కాదని అన్నారు.
బీఆర్‌ఎస్ పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి దారుణాలకు పాల్పడ లేదన్న ఆయన, ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలను గౌరవించినట్లు తెలిపారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కావాలనే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ ప్రొటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలకు స్థానిక నియోజకవర్గంలో జరిగే ఏ పనికి సంబంధించైనా ప్రొటోకాల్ ఉంటుందని, కాంగ్రెస్ నాయకులు కావాలని తమ ఎమ్మెల్యేలను అవమానించేలా ప్రొటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. కల్యాణి లక్ష్మి చెక్కుల పంపిణీ మొదలు, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్దిదారులకు అందించాల్సిన చెక్కులను స్థానిక ఎమ్మెల్యేను కాదని కాంగ్రెస్ నాయకులే పంపిణీ చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.
చాలా చోట్ల ఇదే పరిస్థితి : అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభ కార్యక్రమాల్లో కూడా ఎమ్మెల్యే లేకుండానే పూర్తి చేస్తున్నారన్న ఆయన, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేని చోట పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి, లేదంటే అక్కడి కాంగ్రెస్ నాయకులే ఎమ్మెల్యేలు అన్నట్లుగా వ్యవహారం జరుగుతోందని మండిపడ్డారు. హుజూరాబాద్, మహేశ్వరం, ఆసిఫాబాద్ సహా ఇలా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడుతూ, ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలపైనే ఎదురుదాడి చేస్తున్నారని, ప్రభుత్వంలోని పెద్దల బెదిరింపుల కారణంగా అధికారులు కూడా వాళ్లు చెప్పిన విధంగా చేసే పరిస్థితి తీసుకొచ్చారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
కొండ నాలుకకు మందేస్తే - ఉన్న నాలిక ఊడినట్లుంది : కేటీఆర్ - KTR Tweet On Pension Recovery