BRS Leaders Inspected Flood Affected Areas : భారీ వర్షం కురవడంతో దెబ్బతిన్న నాగార్జున సాగర్ ఎడమ కాల్వను బీఆర్ఎస్ నేతలు పరిశీలించి, పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. ఖమ్మం జిల్లా పర్యటనలో మాజీ మంత్రులు హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ నేతల బృందం ఉన్నారు. వరదల వల్ల నష్టపోయిన ప్రజలకు ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు నష్టపోయిన ప్రజలు, రైతులకు ధైర్యం చెప్పడానికే వచ్చామన్నారు. ఆపద కాలంలో రాజకీయాలు చేయాల్సిన అవసరం తమ పార్టీకి లేదని తెలిపారు. ప్రజలకు ధైర్యం చెప్పవలసిన సీఎం రెండు రోజులు పత్తా లేకుండా పోయి తన తప్పును దాచిపెట్టడానికి కేసీఆర్, బీఆర్ఎస్లపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పెళ్లికి చావుకి తేడా తెలియని పరిస్థితిలో ముఖ్యమంత్రి ఉన్నారని ధ్వజమెత్తారు.
సాగర్ ఎడమ కాల్వ కట్ట దెబ్బతినడానికి ప్రధాన కారణం ప్రభుత్వమేనని, రైతులు ఆధారాలు కూడా చూపిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఆరోపించారు. ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులు అక్కడకు నీళ్లు తీసుకుపోయేందుకు కాల్వ కట్ట మీద పోలీసులను పెట్టి తూములు మూసివేసి గాట్లకు వెల్డింగ్ చేసి నీళ్లు పోకుండా చేశారని విమర్శించారు. ఇది ప్రకృతి విలయంతో తెగిన కాల్వ కాదని, కేవలం అధికారపార్టీ మంత్రులు చేసిన నిర్వాకం అని ధ్వజమెత్తారు.