BRS Ex Minister Mahmood Ali Fires on CM Revanth : రాష్ట్రంలో ముస్లింలు అనాథలు అయ్యారని, మైనార్టీలకు రేవంత్ రెడ్డి ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మహమూద్ అలీ అన్నారు. మైనార్టీల కోసం కేసీఆర్ చాలా మంచి కార్యక్రమాలు చేశారన్న ఆయన, కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ఎప్పుడూ అన్యాయమే చేస్తుందని ఆరోపించారు. మైనార్టీలకు కూడా హస్తం అన్యాయం చేసిందని, లౌకికవాదం అని చెప్పుకుంటుంది కానీ, ఏమీ చేయదని అన్నారు.
గులాబీ ఎప్పటికీ కమలంతో కలవదు : దేశంలో లౌకికవాదాన్ని పాటించేది ప్రాంతీయ పార్టీలు మాత్రమే అన్న మహమూద్ అలీ, లౌకికవాదాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసింది కేసీఆర్ మాత్రమేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతల మాటలు విని మోసపోయామని పలువురు ముస్లింలు చెప్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కుఅని దొంగ ఆరోపణలు చేస్తున్నారని ఆక్షేపించిన మహమూద్ అలీ, గులాబీ పార్టీ ఎప్పటికీ కాషాయ దళానికి మద్దతు తెలపదని స్పష్టం చేశారు.
"సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పెద్ద పెద్ద అబద్ధాలతో ప్రజలను మభ్యపెడుతోంది. హామీల వాగ్ధానాల అమలుపై మాట్లాడకుండా, లేనిపోని మాటలతో జనాలను అయోమయానికి గురి చేస్తోంది. బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు అని కాంగ్రెస్ దొంగ ఆరోపణలు చేస్తోంది. అదే నిజమైతే ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ ఎందుకు జరుగుతుంది. గులాబీ పార్టీ ఎప్పటికీ బీజేపీకి మద్దతు తెలపదు." -మహమూద్ అలీ, బీఆర్ఎస్ మాజీమంత్రి
BRS Focus on MP Elections :హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని అన్నారు. సీఏఏకు వ్యతిరేకంగా పార్లమెంట్లో మాట్లాడేది బీఆర్ఎస్ మాత్రమేనని, ముస్లిం మైనార్టీలు గులాబీ పార్టీకి అండగా నిలవాలని మాజీ మంత్రి కోరారు. కేసీఆర్ హయాంలో 12 మసీదులను కూల్చారని రేవంత్ రెడ్డి చెప్పడం సబబు కాదని తోసిపుచ్చారు. బీఆర్ఎస్ హయాంలో ఫ్రెండ్లీ పోలీసు ఉండగా, ఇప్పుడు ఎందుకు ఇలా మారిందని అందరూ అనుకుంటున్నారని తెలిపారు. నార్సింగి ప్రాంతం దుబాయ్‌ను మించి అభివృద్ధి చెందుతోందని, విజయవంతమైన తెలంగాణ మోడల్‌ను నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ దెబ్బ తీసిందని మహమూద్ అలీ ఆరోపించారు. ప్రజల్లో మార్పు మొదలైందన్న ఆయన, ఈ ఎంపీ ఎన్నికల్లోగులాబీ పార్టీ 12 ఎంపీ స్థానాలు గెలుచుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.