తెలంగాణ

telangana

ETV Bharat / politics

'అమృత్​ టెండర్లలో తెలంగాణ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోంది' : కేంద్రానికి కేటీఆర్​ లేఖ - ktr letter on amrit scheme tenders - KTR LETTER ON AMRIT SCHEME TENDERS

KTR on Amrit Scheme Tenders Corruption : రాష్ట్రంలో అమృత్​ పథకం టెండర్లలో రాష్ట్ర ప్రభుత్వం అవినీతి చేసిందని కేంద్రానికి కేటీఆర్​ లేఖ రాశారు. వెంటనే ఈ విషయంపై జోక్యం చేసుకోవాలని కేంద్రమంత్రులను కోరారు. ఈ టెండర్ల విషయంలో నిజం నిగ్గు తేల్చాలని కోరారు.

KTR on Amrit Scheme Tenders Corruption
KTR on Amrit Scheme Tenders Corruption (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 20, 2024, 7:40 PM IST

KTR Letter to Center on Amrit Scheme Tenders Corruption : అమృత్​ టెండర్లలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రులను బీఆర్​ఎస్​ నేత కేటీఆర్​ కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర మంత్రులు మనోహర్​ లాల్​ ఖట్టర్​, టోచన్​ సాహులకు లేఖ రాశారు. ఈ టెండర్లలలో నిజం నిగ్గు తేల్చాలని అన్నారు.

అమృత్​ టెండర్లలలో అవకతవకలపై స్పష్టత ఇవ్వాలని బీఆర్​ఎస్​తో పాటు రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ అనేకసార్లు డిమాండ్​ చేసినా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాధానం రాలేదని లేఖలో కేటీఆర్​ పేర్కొన్నారు. అమృత్​ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన నిధుల్లో దాదాపు రూ.1500 కోట్ల టెండర్లు ముఖ్యమంత్రి సొంత బావమరిది కంపెనీకి అర్హతలు లేకున్నా కట్టబెట్టారని ఆరోపించారు. ఈ ఆరోపణలపై వెంటనే విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చాలని కోరారు.

ఈ టెండర్ల సమాచారం బయటకు పోకుండా కాంగ్రెస్​ ప్రభుత్వం చీకటి ఒప్పందాలు చేసుకుందని కేంద్రమంత్రులకు రాసిన లేఖలో కేటీఆర్​ వివరించారు. సీఎం బావమరిది ఈ మొత్తం వ్యవహారంలో భాగస్వామిగా ఉన్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులకు సంబంధించిన విషయం అయినందున వెంటనే అమృత్​ పథకంలో గత తొమ్మిది నెలలుగా జరిగిన ప్రతి టెండర్​ను సమీక్షించాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన టెండర్లను రద్దు చేయాలని కేంద్రమంత్రిని కోరారు.

ఎలాంటి అనుభవం లేకున్నా కేవలం ముఖ్యమంత్రి బంధువు అన్న ఏకైక అర్హతతో ఈ టెండర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆయా కంపెనీలకు కట్టబెట్టిందని కేటీఆర్​ ఆరోపించారు. టెండర్ల విషయాన్ని, టెండర్లు దక్కించుకున్న కంపెనీల విషయాన్ని ప్రభుత్వం బయటకు రాకుండా పురపాలక శాఖ విభాగాలతో పాటు ఇతర ఈ-టెండరింగ్​ వెబ్​ సైట్లలోనూ సమాచారం ఉంచకుండా రాష్ట్ర ప్రభుత్వం కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోందని ఆక్షేపించారు.

ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక విమర్శలు చేసిన కంపెనీకి కూడా దాదాపు 40 శాతానికి పైగా అంచనాలు పెంచి మరీ పనులు అప్పగించినట్లు ఆరోపణలు ఉన్నాయని లేఖలో కేటీఆర్​ తెలిపారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని టెండర్ల డాక్యుమెంట్లను వెంటనే బహిర్గతం చేయాలని, టెండర్లు దక్కించుకున్న కంపెనీల వివరాలను కూడా ప్రజల ముందు పారదర్శకంగా ఉంచాలని డిమాండ్​ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన టెండర్లను వెంటనే రద్దు చేయాలని, అమృత్​ పథకం నిధుల్లో జరుగుతున్న అవినీతిపై విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కేటీఆర్​ కోరారు.

సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్ ఎత్తిపోతల కాంట్రాక్టు పనులను సీఎం బావమరిది కంపెనీలకు, వేరే కంపెనీలకు అప్పజెప్పినట్లు కేటీఆర్​ లేఖలో కేంద్రమంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. తొమ్మిది నెలల కాలంలో రాష్ట్రంలో పురపాలక శాఖ పరిధిలో జరిగిన అన్ని టెండర్లలోనూ, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో కొనసాగే కార్యక్రమాల టెండర్ల విషయంలో నిజాలు నిగ్గు తేల్చి ప్రజల ముందు ఉంచాలని కేటీఆర్ కోరారు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్​ఎస్​తో పాటు బీజేపీ నేతలు సైతం చేస్తున్న ఆరోపణలపై వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోపోతే రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రానికి కూడా భాగస్వామ్యం ఉందని ప్రజలు నమ్ముతారని కేటీఆర్​ అన్నారు.

పౌరసరఫరశాఖలో వేల కోట్లు స్కామ్‌ జరిగినా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదు : పాయల్‌ శంకర్ - Payal Shankar On Civil Supplies

లీజుల దందా - అద్దెల చెల్లింపులో హెచ్​ఎండీఏకు మొండిచెయ్యి

ABOUT THE AUTHOR

...view details