KTR on Congress about Telangana Debt : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే 50 వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకురావడంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. మార్పు అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, గతంలో ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఎనిమిది నెలల్లోనే రూ. 50 వేల కోట్ల అప్పు చేయటమేనా వాళ్లు చెప్పిన మార్పు అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఒక్క కొత్త ప్రాజెక్ట్ కూడా లేకుండా 50 వేల కోట్ల రూపాయలు అప్పు తేవాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు.
2023 నాటికి రాష్ట్రం రూ.5,900 కోట్ల మిగులు బడ్జెట్తో ఉంటే ఎనిమిది నెలల కాలంలో దాన్ని రూ.50 వేల కోట్ల రుణానికి తీసుకెళ్లారని కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్ర సంపద పెంచిన బీఆర్ఎస్పై అప్పులు చేశారంటూ తప్పుడు ప్రచారం చేశారని ఆక్షేపించారు. అపోహలు, అర్ధసత్యాలను ప్రచారం చేసి జనాన్ని తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మాత్రం ఇప్పుడు అన్ని రికార్డులు బద్దలు కొడుతూ అప్పులు చేయటంలో టాప్లో నిలుస్తోందని ఎద్దేవా చేశారు. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని కేటీఆర్ ప్రశ్నించారు.
కాంగ్రెస్ పదవీకాలం ముగిసే నాటికి ఐదు లక్షల కోట్ల అప్పు : ఇదే విధంగా అప్పులు చేసుకుంటూ పోతే కాంగ్రెస్ పదవీకాలం ముగిసే నాటికి నాలుగు నుంచి ఐదు లక్షల కోట్ల రూపాయల అప్పుల భారం రాష్ట్రంపై పడడం ఖాయమని కేటీఆర్ అన్నారు. అప్పుల విషయంలో బీఆర్ఎస్ను బద్నాం చేసి ప్రజలను మోసం చేయటంలో కాంగ్రెస్ విజయవంతమైందని వ్యాఖ్యానించారు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని సరైన సమయంలో కాంగ్రెస్కు కచ్చితంగా బుద్ధి చెబుతారని కేటీఆర్ పేర్కొన్నారు.