BJP Purandeswari Fire on YSRCP:వైఎస్సార్సీపీ తమ ఐదేళ్ల పాలనలో సాగించిన అరాచకాలపై ఆత్మపరిశీలన చేసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాయలసీమ ప్రాంతానికి చెందిన వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు సుమారు 200 మంది పురందేశ్వరి సమక్షంలో పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. అనంతపురం, ప్రకాశం, సత్యసాయి, కడప, చిత్తూరు జిల్లాలకు చెందిన ముఖ్యమైన నాయకులు పార్టీలో చేరడం ఆహ్వానించదగిన పరిణామంగా పేర్కొన్నారు.
ప్రధాని మోదీపై ప్రజలకు ఉన్న నమ్మకంతోనే ఎన్డీయేకి మూడోసారి విజయం ఇచ్చారని.. పేద, మధ్య తరగతి ప్రజల సంక్షేమం పార్టీకి ముఖ్యమని అన్నారు. సబ్ కా సాత్, సబ్ వికాస్ నినాదాన్ని కార్యాచరణలో పెడుతున్నామని చెప్పారు. ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో నెల్లూరులో బీజేపీ మహిళా నేతపై జరిగిన దాడి వంటి విషయాలు ప్రధానికి లేఖ రాసే ముందు వైఎస్సార్సీపీ నేతలకు గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రలో కరోనా సమయంలో డాక్టర్ సుధాకర్ పట్ల అప్పటి ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఎవరూ మరువలేనిదన్నారు. ప్రజాహిత పాలనను రాష్ట్రంలో చంద్రబాబు అందిస్తారని భావిస్తున్నామని పురందేశ్వరి అన్నారు.