AP PCC YS Sharmila Election Campaign :ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన సొంత గడ్డపై నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. వైఎస్సార్ జిల్లా పార్లమెంటు పరిధి నుంచి కాంగ్రెస్ తరపున బరిలోకి దిగుతున్న ఆమె ఈ నెల 5వ తేదీ నుంచి ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. బద్వేలు నియోజకవర్గంలోని కాశినాయన మండలం అమగంపల్లి నుంచి ప్రారంభమయ్యే ఈ బస్సు యాత్ర 8 రోజుల పాటు కొనసాగనుంది. జిల్లాలోని అన్ని మండలాలో పర్యటిస్తూ ప్రజలతో మమేకం కానున్నారు. సొంత జిల్లాలో సీఎం జగన్ మోహన్ రెడ్డికి ( Jagan Mohan Reddy) వ్యతిరేకంగా ఆయన సోదరి వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారం చేయటం వైఎస్సార్సీపీను ఇరకాటంలో పెట్టే విధంగా ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాబాయిని చంపినవారికి జగన్ టికెట్ ఇవ్వటం జీర్ణించుకోలేకనే కడప నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు వైఎస్ షర్మిల తెలిపారు.
YS Sharmila Election Campaign Schedule :వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారం రేపటి నుంచి ప్రారంభం కానుంది. 5వ తేదీ ఉదయం నుంచి రాత్రి వరకు కాశినాయన, కలసపాడు, పోరుమామిళ్ల, బి.కోడూరు, బద్వేలు, అట్లూరు మండలాల్లో షర్మిల బస్సు యాత్ర సాగనుంది. మొదటి రోజే ఆరు మండలాల్లో పర్యటన ఉండే విధంగా రూట్ మాప్ సిద్ధం చేశారు. 6వ తేదీ కడప, 7వ తేదీ మైదుకూరు నియోజకవర్గం, 8న కమలాపురం నియోజకవర్గం, 10న పులివెందుల నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో బస్సుయాత్ర సాగనుంది. 11న జమ్మలమడుగు, 12న ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో షర్మిల పర్యటన సాగే విధంగా పార్టీ నాయకులు రూట్ మాప్ సిద్ధం చేశారు. దాదాపు 8 రోజుల పాటు షర్మిల కడప పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారు.