జగన్ సర్కార్ నిర్వాకం - రూ. 250 కోట్లు కోల్పోయిన పోలీసు శాఖ - Lost ASUMP Scheme Funds in AP
YSRCP Neglect on ASUMP Funds : గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పోలీసు శాఖను అన్ని విధాలుగా నాశనం చేసి, దాని వెన్ను విరిచేసింది. దీనికి తోడూ ఏఎస్‌యూఎంపీ పథకం కింద కేంద్ర ఇచ్చే నిధులకు రాష్ట్ర వాటా జమ చేయలేదు. ఫలితంగా ఐదేళ్లలో రాష్ట్ర పోలీసు శాఖ రూ.250 కోట్లు కోల్పోయింది. ఫలితంగా బలగాల ఆధునికీకరణపై కోలుకోలేని దెబ్బ పడింది.
Lost ASUMP Scheme Funds in AP : గత జగన్ సర్కార్ నిర్వాకంతో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన దాదాపు రూ.250 కోట్ల నిధుల్ని రాష్ట్ర పోలీసు శాఖ కోల్పోయింది. పోలీసు బలగాల ఆధునికీకరణ కోసం రాష్ట్రాలకు సాయం (ఏఎస్‌యూఎంపీ) పథకంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏపీకి చేసిన కేటాయింపులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ జమ చేయకపోవటంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఫలితంగా ఏడాదికి కనీసం రూ.50 కోట్ల చొప్పున కోల్పోయినట్లు అంచనా.
YSRCP Neglect on Police Department : ఏఎస్‌యూఎంపీ పథకంలో కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం వాటాలు భరించాలి. జగన్ సర్కార్ రాష్ట్ర వాటా నిధులివ్వలేదు. అంతకు ముందు జరిగిన పలు పనులకు సంబంధించిన వినియోగ పత్రాలనూ (యూసీలు) కేంద్ర ప్రభుత్వానికి సమర్పించలేదు. వీటన్నింటి వల్ల నేర నియంత్రణ, పరిశోధన, కేసుల ఛేదన, శాంతిభద్రతల పరిరక్షణపరంగా అవసరమైన కీలక మౌలిక వసతులు, అధునాతన సాంకేతికత సమకూర్చుకోవటంలో పోలీసు శాఖ వెనకబడింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన పలు కీలక వ్యవస్థల వార్షిక నిర్వహణకు కూడా నిధుల్లేక అవి నిర్వీర్యమయ్యాయి. మొత్తంగా వైఎస్సార్సీపీ సర్కార్ పోలీసు శాఖను అన్ని విధాలుగా నాశనం చేసి, దాని వెన్ను విరిచేసింది.
టీడీపీ హయాంలో కేటాయింపులకు మించి నిధులు :పోలీసు బలగాల ఆధునికీకరణకు కేంద్రం కేటాయించిన నిధులకు ఎప్పటికప్పుడు రాష్ట్ర వాటా జమ చేయటం, వినియోగ పత్రాలు సమర్పించటంతో టీడీపీ సర్కార్ హయాంలో ఈ పథకం కింద ప్రోత్సాహకంగా అదనపు నిధులు లభించేవి. ఏపీ విభజన వల్ల కీలక మౌలిక వసతుల్ని కోల్పోయిన పోలీసు శాఖకు తిరిగి వాటిని సమకూర్చుకోవటానికి ఈ నిధులు ఎంతోకొంత ఉపయోగపడేవి. రాష్ట్రస్థాయి ఫోరెన్సిక్ ప్రయోగశాల భవన నిర్మాణం సహా తెలుగుదేశం హయాంలో ఆ దిశగా అడుగులు ముందుకు పడ్డాయి. ఈ ఒరవడిని కొనసాగించుంటే గత ఐదేళ్లలో పోలీసు శాఖ పటిష్ఠమయ్యేందుకు అవకాశం ఉండేది. కానీ జగన్ ప్రభుత్వం వాటన్నింటినీ అటకెక్కించేసింది.
ఏఎస్‌యూఎంపీ పథకం కింద టీడీపీ సర్కార్ హయాంలో 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.26.48 కోట్ల కేటాయింపులు చేశారు. అంతకు దాదాపు రెట్టింపు అంటే రూ.50.81 కోట్ల నిధులు విడుదలయ్యాయి. అదే వైఎస్సార్సీపీ పాలనలో ఏటేటా కేంద్రం కేటాయింపులు తగ్గిపోయాయి. 2020-21 నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరం వరకు కేవలం రూ.6.27 కోట్లే విడుదలయ్యాయి. ఏపీ ప్రభుత్వం తగిన ప్రతిపాదనలు పంపించకపోవటం, మ్యాచింగ్ గ్రాంట్ జమ చేయకపోవటమే దీనికి ప్రధాన కారణం.
ఏఎస్‌యూఎంపీ కింద నిధులు రాకపోవటంతో వాహనాలు, ఆయుధాల కొనుగోలు, అధునాతన సాంకేతిక వ్యవస్థల ఏర్పాటు తదితర విషయాల్లో పోలీసు శాఖ వెనకబడింది.