Farmer Plowing Cauliflower Crop with Tractor: ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు సరైన ధర దక్కక అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. సరైన ధర రాక, కొనే నాథుడు లేక పంటను భూమిలో కలియదున్నుతున్నారు. ఇటీవల క్యాబేజీ పంటను దున్నేయగా తాజాగా క్యాలీఫ్లవర్ వంతు వచ్చింది. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కోసూరువారిపాలెంలో బడే వెంకట రమణ అనే రైతు తనకున్న 50 సెంట్ల భూమిలో పండించిన క్యాలీఫ్లవర్ పంటను పండించాడు. ఆ పంటను వారాంతపు సంతకు పంపితే బస్తాకు రూ.50 వచ్చాయని కూలీల ఖర్చు కూడా రాలేదని రైతు వాపోతున్నాడు.
కృష్ణా నది వరదల వలన పంటలు అన్ని నేలపాలు అవడం, అందరు రైతులు ఒకసారి పంటలు సాగు చేయడం వలన పంటలకు కనీస ధర లేకుండా పోయిందని వెంకట రమణ వాపోయారు. వరదలు తగ్గగానే క్యాలీఫ్లవర్ పంట వేయగా ఇది కూడా పడిపోయిందని అన్నారు. అంతకుముందు మిర్చి పంట వేయగా మిర్చికి తెగుళ్లు వ్యాపించి ఆ పంట కూడా నాశనం అయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. మూడో సారి క్యాలీఫ్లవర్ పంట సాగుచేస్తే ఇప్పడు ధర లేకుండా పోయిందని రైతు ఆవేదన చెందుతున్నాడు. ఇప్పటి వరకు క్యాలీఫ్లవర్ పంటకు 70 వేల రూపాయలు పెట్టుబడి పెట్టానని, ఇప్పుడు కనీసం కూలీల ఖర్చులు కూడా రావడం లేదని రైతు తెలిపారు.
ఈ సంవత్సరం క్యాబేజీ, క్యాలీఫ్లవర్ సాగుచేసిన రైతులు అయోమయంలో ఉన్నారు. ఎక్కువ మంది పొలంలోనే వదిలి వేస్తున్నారు మరికొంత మంది రైతులు పంటలను ట్రాక్టర్‌తో దున్ని వేస్తున్నారు. లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే ఒక్క రూపాయి కూడా రాలేదని రైతులు వాపోతున్నారు. మార్కెటింగ్ శాఖ అధికారులు ధరలు లేనప్పుడు రైతు వద్దకు వచ్చి తమ సమస్యలు తెలుసుకోవాలని, రైతు బజార్ల ద్వారా అమ్మకాలు చేసేందుకు అవకాశం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. ఉద్యానశాఖ అధికారులు ఎంత విస్తీర్ణంలో పంటలు సాగు వివరాలు ప్రభుత్వానికి తెలిపి పంట మార్పిడి, వేరొక పంటలు సాగు చేసేందుకు సలహాలు, సూచనలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.
పంటలను దృష్టిలో పెట్టుకోండి - ఇరు రాష్ట్రాలకు స్పష్టం చేసిన కేఆర్‌ఎంబీ