AP Govt Exercise White Paper on Lands Encroachment :గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో భూకబ్జాలు, విశాఖలో దసపల్లా వంటి విలువైన స్థలాల అన్యాక్రాంతం, అసైన్డ్ భూములపై శాశ్వత హక్కుల పేరుతో అక్రమాలు, సహజ వనరుల దోపిడీ వంటి అంశాలపై ప్రభుత్వం త్వరలో శ్వేతపత్రం విడుదల చేయనుంది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం సచివాలయంలో మంత్రులు కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్, టీజీ భరత్‌తో కలిసి ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు.
ఏపీ భూ హక్కు చట్టం, రీసర్వే, విద్యుత్ సంస్థలు, వైఎస్సార్సీపీ కార్యాలయాలకు భూముల కేటాయింపు, పేదలకు సెంటు స్థలాలు, రెవెన్యూ వ్యవహారాల్లో ఆ పార్టీ నాయకుల జోక్యం వంటి అంశాలపై అధికారులు రూపొందించిన నివేదికను చంద్రబాబు పరిశీలించారు. అప్పట్లో జరిగిన తప్పులన్నీ ముఖ్యమంత్రి, మంత్రులు, అప్పటి నేతలే చేసినట్టుగా ఉంది. కానీ వాటిలో ఎక్కడా తమ ప్రమేయమే లేనట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ నివేదిక సమగ్రంగా లేదంటూ చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. పూర్తి వివరాలతో మరింత లోతుగా తయారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
విశాఖలో భూముల స్వాహా! :విశాఖలో రామానాయుడు స్డూడియో భూములను నిబంధనలకు విరుద్ధంగా, రెసిడెన్షియల్ కేటగిరీలోకి మార్చారని అధికారులు నివేదికలో పేర్కొన్నారు. వివాదాస్పద సీబీసీఎన్సీ భూముల్లో వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భవన నిర్మాణ ప్రాజెక్టుకు అనుమతులిచ్చినట్లు వెల్లడించారు. రూ.65 కోట్ల విలువైన టీడీఆర్ బాండ్లు జారీ చేశారని చెప్పారు. ఎన్సీసీ, దసపల్లా, హయగ్రీవ భూములు స్వాహా చేశారని అధికారులు నివేదికలో తెలిపారు.
తక్కువ ధరకు కొట్టేసిన వైఎస్సార్సీపీ నేతలు : శారదా పీఠానికి కొత్తవలసలో అత్యంత విలువైన 15 ఎకరాల భూమిని, ఎకరం ఒక రూపాయి చొప్పున కేటాయించినట్లు, అధికారులు నివేదికలో తెలిపారు. కేటాయింపు జరిగి 20 ఏళ్లు దాటిన అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించేలా వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన చట్టం మేరకు, 9,93,284 ఎకరాలను 22(ఎ) జాబితా నుంచి తప్పించినట్లు స్పష్టం చేశారు. ఆ భూములను పేదల నుంచి వైఎస్సార్సీపీ నాయకులు తక్కువ ధరకు కొట్టేశారని అధికారులు వివరించారు.
ఈ చట్టాన్ని మరే రాష్ట్ర ప్రభుత్వమూ తీసుకురాలేదు : నీతి ఆయోగ్ ప్రతిపాదించిన నమూనా టైట్లింగ్ యాక్ట్ స్ఫూర్తికి భిన్నంగా, వైఎస్సార్సీపీ ప్రభుత్వం ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని రూపొందించిందని పేర్కొన్నారు. ఆ చట్ట నిబంధనలతో ప్రజల భూములకు రక్షణ ప్రశ్నార్థకం కానుందని తెలిపారు. ప్రమాదకరమైన ఈ చట్టాన్ని మరే రాష్ట్ర ప్రభుత్వమూ తీసుకురాలేదని గుర్తుచేశారు. భూముల రీసర్వే నిర్వహణకు సమయం ఇవ్వనందున, తుది రికార్డుల్లో అనేక తప్పులు దొర్లాయని అధికారులు వివరించారు.
పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ ఫొటోలు వేయడాన్నీ నివేదికలో అధికారులు ప్రస్తావించారు. ఒంగోలు సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా భూకుంభకోణాలు జరిగాయని చెప్పారు. జనన, మరణ ధ్రువపత్రాల జారీలోనూ అక్రమాలకు పాల్పడ్డారని వెల్లడించారు. సర్వే రిపోర్టు, భూ మార్పిడి, పాత స్టాంపు పేపర్లపై పాత తేదీలు నమోదు చేసి, నకిలీ వ్యక్తులతో జీపీఏలను సృష్టించారని తెలిపారు. కుటుంబ వివాదాల్లో ఉన్న, అన్‌క్లెయిమ్డ్ ప్రైవేట్ భూములను కొందరు స్వాహా చేశారని వెల్లడించారు.
రెవెన్యూ వ్యవహారాలన్నింటా జోక్యం : ఇళ్ల పట్టాలు, వ్యవసాయ భూముల పంపిణీకి లబ్ధిదారుల ఎంపికలోనూ, వైఎస్సార్సీపీ నాయకులు జోక్యం చేసుకునేవారని, అధికారులు తమ నివేదికలో ప్రస్తావించారు. లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేసేవారని తెలిపారు. ఓటర్ల నమోదులోనూ కల్పించుకొని, వారికి అనుకూలంగా పనిచేయాల్సిందిగా అధికారులపై ఒత్తిడి తెచ్చేవారని వివరించారు. తీవ్ర అవకతవకలకు పాల్పడ్డ నలుగురు తహసీల్దార్ల డిస్మిస్, నిర్బంధ పదవీ విరమణ, 10 మంది హోదా తగ్గింపునకు సీసీఎల్ఏ ఆదేశాలిచ్చిందని చెప్పారు. కానీ వైఎస్సార్సీపీ నాయకులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, వారి శిక్షను తగ్గించారని, అధికారులు నివేదికలో పేర్కొన్నారు.
సాగు భూముల్లో అక్రమ లేఔట్లు వేసి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవసాయేతర భూములుగా మార్చేసుకున్నారని తెలిపారు. నాన్ ఆక్వా జోన్ పరిధిలోకి వచ్చే భూములనూ చేపల చెరువులుగా మార్చేశారని వెల్లడించారు. ప్రైవేట్ వ్యక్తుల భూములను 22(ఎ) జాబితాలో పెట్టించి, వారిపై ఒత్తిడి తెచ్చి, కారుచౌకగా కొట్టేశారని అధికారులు సీఎంకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు.