AP CEO and DGP Inspected Strong Rooms: రాష్ట్రంలో ఓట్ల లెక్కింపునకు అధికార యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు సజావుగా సాగడానికి అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా కౌంటింగ్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. వరుసగా జిల్లాలలో పర్యటిస్తూ, అధికారలకో సమీక్షలు నిర్వహిస్తున్నారు. అదే విధంగా స్ట్రాంగ్ రూమ్స్‌లోని భద్రతా ఏర్పాట్ల గురించి సైతం తెలుసుకుంటున్నారు.
తాజాగా పల్నాడు జిల్లాలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముకేష్ కుమార్ మీనా, రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలు పర్యటించారు. మొదటగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని ఎన్నికల కౌంటింగ్‌పై చేపట్టిన చర్యల గురించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం నరసరావుపేట మండలం కాకాని వద్దనున్న జేఎన్టీయూ కళాశాలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముకేష్ కుమార్ మీనా, రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చేరుకున్నారు.
జూన్ 4వ తేదీన జరగనున్న ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లపై పరిశీలన చేశారు. స్ట్రాంగ్ రూమ్స్, ఎన్నికల కౌంటింగ్ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లను సీఈవో ముకేష్ కుమార్ మీనా, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలు కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లఠ్కర్, ఎస్పీ మలికా గార్గ్‌లను అడిగి తెలుసుకున్నారు. కౌంటింగ్ కేంద్రంలోని ఏర్పాట్లపై సీఈవో, డీజీపీలకు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లఠ్కర్, ఎస్పీ మలికా గార్గ్, తదితర అధికారులు వివరించారు.