TDP, Janasena, BJP alliance will Win : టీడీపీ-బీజేపీ- జనసేన కూటమి చరిత్రను తిరగరాయనుందా ? వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయఢంగా మోగించనుందా? ధన బలాన్నే నమ్ముకున్న వైఎస్సార్సీపీ ఓటమి ఖాయమేనా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే పలు సర్వేలు ఈ విషయాన్ని చాటగా తాజాగా ఏబీపీ అనే సంస్థ కోసం సీ-ఓటర్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ ఫలితాలు వెల్లడించింది. దేశ వ్యాప్తంగా సర్వే చేపట్టిన ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్ లో 20 లోక్‌సభ స్థానాలు టీడీపీ భాగస్వామిగా ఉన్న ఎన్డీఏ కూటమి గెలుచుకునే అవకాశాలున్నాయని స్పష్టం చేసింది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం 5 స్థానాలకే పరిమితమయ్యే సూచనలు ఉన్నాయని వెల్లడించింది. ఇప్పటి వరకు ప్రకటించిన జాతీయ సర్వేల ఫలితాలన్నీ టీడీపీకే పట్టం కట్టడం విశేషం. ఫిబ్రవరి చివర, మార్చి మొదటి వారంలో ఈ సర్వే నిర్వహించినట్లు సంస్థ తెలిపింది. తెలంగాణలో కాంగ్రెస్‌కు ఆధిక్యం రావచ్చని అంచనా వేసింది.
పిఠాపురం నుంచి బరిలో పవన్‌కల్యాణ్ - స్వయంగా వెల్లడించిన జనసేనాని
ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అభ్యర్థుల ఎంపికలో మల్లగుల్లాలు పడుతున్న అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 12 విడతలుగా అభ్యర్థులను ప్రకటించింది. మరో వైపు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడగా టీడీపీ 144, జనసేన, బీజేపీ 31 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించాయి. ఓ అడుగు ముందుకేసిన టీడీపీ తొలి జాబితాలో 94 మంది, తాజాగా గురువారం విడుదల చేసిన మలి జాబితాలో 34 మంది గెలుపు గుర్రాలను ఖరారు చేసింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించగా తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు కార్యకర్తల సమావేశంలో తెలిపారు. మొత్తం 25 లోక్‌సభ స్థానాలకు గాను టీడీపీ 17, బీజేపీ 5, జనసేన 3 స్థానాల్లో పోటీ చేయనున్నాయి.