Pratidwani Debate on Uttarandhra Development: ఉత్తరాంధ్రకు పట్టిన గ్రహణం వీడుతోంది. కీలకమైన విశాఖ నగరంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం అడుగులు కొత్త ఆశలు చిగురించేలా చేస్తున్నాయి. విశాఖ కేంద్రంగా తిరిగి ఐటీ జోరుకు సన్నాహాలు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో కదలిక, పోలవరం పూర్తయ్యేలోపే ఉత్తరాంధ్రకు వచ్చే ఏడాది నుంచే నీళ్లు అందించాలన్న ముఖ్యమంత్రి సంకల్పం అందరిదృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ఇదే సమయంలో ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న వైఎస్సార్సీపీ భూకబ్జాలు, అక్రమాలు, వాటిపై ప్రభుత్వం చర్యలు సిద్ధమవుతూ ఉండడం "హమ్మయ్య" అని అక్కడి వారిని ఊపిరి పీల్చుకునే చేస్తోంది. మరి ఉత్తరాంధ్ర ప్రజలేం కోరుకుంటున్నారు? వారి ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం ఇంకా ఏం చేయాల్సి ఉంది? అనే అంశంపై నేటి ప్రతిధ్వని కార్యక్రమం. నేటి చర్చలో ఉత్తరాంధ్ర చర్చా వేదిక కో కన్వీనర్ బీశెట్టి బాబ్జీ, విశాఖపట్నం జీవీఎంసీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ పాల్గొన్నారు.
ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో అక్రమాలు, అరాచకాలను చూసిన ప్రజలకు.. కూటమి ప్రభుత్వం రావటంతో వారిలో అభివృద్ధిపై ఆశలు చిగిరిస్తున్నాయి. గత ఐదేళ్ల పాలనలో విశాఖ కేంద్రంగా జరిగిన వైఎస్సార్సీపీ నేతలు విచ్చలవిడిగా భూ దోపిడీకి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ భూ అక్రమాలు, కబ్జాలు, అరాచక సెటిల్‌మెంట్లను సరిచేయడానికి కూటమి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది.