Pratidhwani : కష్టం వచ్చినప్పుడు ప్రజలు ఎక్కడో ప్రభుత్వం కూడా అక్కడే. విజయవాడ వరద విలయంలో అదే చేస్తోంది కూటమి ప్రభుత్వం. కలెక్టరేట్‌లోనే ముఖ్యమంత్రి మకాం వేసి మరీ సహాయ చర్యలు పర్యవేక్షిస్తుంటే, సమస్త యంత్రాంగం విరామమెరగకుండా శ్రమిస్తోంది. గడిచిన ఐదారు రోజులుగా ముఖ్యమంత్రి కార్యాలయం సహా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే విజయవాడకు తరలి వచ్చింది. అన్ని శాఖల్ని సమన్వయం చేసి రాష్ట్ర వ్యాప్తంగా సిబ్బందిని రప్పించి మోహరించారు. బాధితుల్ని రక్షించి సురక్షిత ప్రాంతాలకు చేర్చడం నుంచి ఆహారం, ఔషధాల పంపిణీ వరకు మేమున్నాం, మీకేం కాదని భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వరద నీరు పారుతున్న చోట్లలో సాధారణ స్థితిని నెలకొల్పేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. ఈ సహాయ చర్యలపై ప్రజలు ఏం అనుకుంటున్నారు బురద రాజకీయాల్ని దాటి మిషన్ విజయవాడ కోసం ప్రభుత్వం ఏం చేస్తోంది? ఇదీ నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న వారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు డీవీ. శ్రీనివాస్, సీనియర్ పాత్రికేయులు ఏ సురేష్.
ముఖ్యమంత్రితో పాటే మొత్తం ప్రభుత్వం విజయవాడకు తరలి రావడంతో పాటు రాష్ట్రం మొత్తం నుంచీ సహాయ చర్యలకు సిబ్బందిని తరలిస్తున్నారు. ఇది ఎలాంటి మేలు చేస్తోంది? వరద ముంచెత్తిన మొదటి రోజు నుంచి ఈ క్షణం వరకు ప్రభుత్వం, అధికారుల స్పందనలో ఎక్కడైనా ప్రయత్నలోపం కనిపించిందా? ఇలాంటి సమయంలో ప్రజలకు ఏం అవసరం?