Prathidwani: ముస్లింలను ఆత్మబంధువులన్నారు. కంటికి రెప్పలా కాపాడుకుంటానని చెప్పారు. 2019 ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్నారు. అధికారంలోకి వచ్చాక ఏం జరిగింది? వైసీపీ నాయకులు రెచ్చిపోయి ముస్లింలపై దాడులు చేస్తుంటే కళ్లప్పగించి చూస్తుండిపోయారు. మైనార్టీ యువతుల్ని వేధించిన వారినీ చట్టం ముందు నిలబెట్టకుండా వదిలేశారు.
దుల్హన్, రంజాన్ తోఫా, విదేశీ విద్య లాంటి పథకాల్ని పక్కన పెట్టేశారు. ఇస్లామిక్ బ్యాంక్ సంగతి సరేసరి. ఐదేళ్ల జగన్ పాలనలో దాడులు, వేధింపులు, కోతల సంక్షేమం తప్ప, ముస్లింలకు ఒరిగిందేంటి? మైనార్టీల మనోభావాలు ఎలా ఉన్నాయి? ఈసారి వాళ్ల తీర్పు ఎటు? ఇదీ నేటి అంశంపై నేటి ప్రతిధ్వని కార్యక్రమంలో తెలుసుకుందాం. దీనిపై చర్చించేందుకు మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూఖ్ షిబ్లీ, ముస్లిం ఉద్యమనాయకులు, న్యాయవాది బషీర్ అహ్మద్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నాలుగున్నరేళ్ల వైసీపీ పాలనలో ముస్లిం మైనార్టీలకు మిగిలింది దోకాయేనా?
సీఎం జగన్‌మోహన్‌రెడ్డి బహిరంగ సభల్లో నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అంటూ ప్రేమ కురిపిస్తున్నా ఆచరణలో మాత్రం వారిని ఆదుకున్నది లేదు. తన పదవీకాలంలో ముస్లిం, మైనార్టీల ప్రజలకిచ్చిన హామీలలో ఒక్కటి కూడా అమలు చేయలేదనే చెప్పాలి. ముస్లిం మైనార్టీలు అత్యధికంగా ఉన్న జిల్లాల్లో ఉమ్మడి గుంటూరు ఒకటి. ఇక్కడ ఏ నియోజకవర్గంలో చూసినా ఈ జనాభా సంఖ్య ఎక్కువే. సగటున 20 వేల నుంచి 40 వేల వరకు వారి ఓట్లు ఉన్నాయి.
గుంటూరు తూర్పులో అయితే అత్యధికంగా 50 వేలకు పైబడి ఓటర్లు ఉన్నారు. వైసీపీ హయాంలో ఈ వర్గాల సంక్షేమం, అభివృద్ధికి జగన్ కొత్తగా ఒక్క పథకాన్ని ప్రవేశపెట్టకపోగా మేనిఫెస్టోలో ఇచ్చినవి అమలు చేయకుండా విస్మరించారు. గత టీడీపీ ప్రభుత్వం ముస్లింలకు ఏటా రంజాన్ తోఫా అందజేసింది. ఈ అయిదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఒక్కసారీ ఇవ్వలేదు. ఒక్క ఉమ్మడి గుంటూరులోనే ఈ పథకానికి 4 లక్షల మంది లబ్ధిదారులు ఉండేవారు.
Prathidhwani: నాలుగేళ్లలో ముస్లింలకు వైసీపీ సర్కార్ చేసిందేమిటి?
దుల్హన్ పథకం అంతే:దుల్హన్ పథకం పేద ముస్లిం యువతకు పెళ్లిళ్లు చేసి వారు జీవితంలో స్థిరపడేలా పెళ్లి ఖర్చులతో పాటు స్వయం ఉపాధికి చర్యలు తీసుకుంది. ఒకే రోజు సామూహిక వివాహాలు జరిపించి వధూవరుల తరఫు వారికి భోజనాలు పెట్టించడంతో పాటు బీరువా వంటివి కొనుగోలు చేసి ఇచ్చారు. షాదీముబార్ కింద తక్షణ సాయంగా వాటిని అందించారు. వైసీపీ ప్రభుత్వం దాన్ని ఎత్తివేసింది. వైఎస్సార్ కానుకగా రూ.లక్ష ఇస్తామని ఏడాది క్రితం ప్రకటించింది. దీనికి దరఖాస్తులు అయితే స్వీకరించింది కానీ ఇప్పటివరకు సాయం అందించలేదు.