Mysore King Yaduveer Contest Lok Sabha Election 2024 :సార్వత్రిక ఎన్నికల్లో 370కు పైగా సీట్లే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల్లోనూ మెరుగైన ఫలితాలను రాబట్టాలని భావిస్తోంది. అందులో భాగంగా దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించింది. బుధవారం విడుదల చేసిన బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల రెండో జాబితాలో మైసూర్ యువరాజు యదువీర్ కృష్ణదత్త ఒడెయార్ను, మైసూర్-కొడగు స్థానం నుంచి బరిలో దింపింది. సిట్టింగ్ ఎంపీ ప్రతాప్ సింహాను పక్కనపెట్టి యదువీర్ను రంగంలోకి లోక్‌సభ ఎన్నికల పోరులో నిలిపింది. మైసూర్ రాజవంశానికి ఉన్న ప్రాబల్యాన్ని ఓట్లుగా మార్చుకునేందుకు బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో యదువీర్‌కు సీటు ఇచ్చిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
దక్షిణాదిలో బలం పుంజుకునేందుకు!
ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిలో బీజేపీకి కాస్త బలం తక్కువ. అయితే దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రం కర్ణాటక. గతేడాది వరకు అధికారంలో ఉన్న కమలదళం అక్కడ బాగానే సీట్లు రాబట్టాలని ఉవ్విళ్లూరుతుంది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉండగా, 2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాలని రిపీట్ చేయాలనుకుంటే మాత్రం మరింత కష్టపడాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ అధిష్ఠానం జేడీఎస్‌తో పొత్తు కుదర్చుకుందని చెబుతున్నారు. మైసూర్ రాజ వంశీకుల ప్రభావం ఆ సమీప ప్రాంతాల్లోని లోక్‌సభ సీట్లపైన కూడా ఉంటుందని, అందుకే సిట్టింగ్ ఎంపీ ప్రతాప్ సింహాను కాదని యదువీర్ను సార్వత్రిక పోరులో బీజేపీ దింపిదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రాజవంశానికి రాజకీయాలు కొత్తేమీకాదు
31 ఏళ్ల యదువీర్ అమెరికాలో చదువుకున్నారు. 2015 మే 28న మైసూర్ రాజసంస్థానానికి యువరాజుగా పట్టాభిషిక్తుడయ్యారు. కాగా, మైసూరు రాజకుటుంబానికి రాజకీయాలు కొత్తేమి కాదు. అంతకుముందు మైసూర్ రాజు శ్రీకంఠదత్త నరసింహరాజ ఒడెయార్ మైసూరు పార్లమెంట్ నియోజకవర్గానికి కాంగ్రెస్ తరఫున నాలుగుసార్లు ప్రాతినిధ్యం వహించారు. కొన్నాళ్లు బీజేపీలో కూడా ఆయన పనిచేశారు.