Why does Coffee Taste Bitter :చాలా మందికి ఉదయాన్నే కప్పు కాఫీ తాగకుండా రోజు ప్రారంభం కాదు. అలాగే కొందరు తలనొప్పిగా అనిపించినా కాఫీ తాగుతుంటారు. బయట ఇద్దరు, ముగ్గురు ఫ్రెండ్స్ కలిసినా, ఇంటికి బంధువులు వచ్చినా కాఫీ/టీలతో కాస్త సమయం వెచ్చిస్తుంటాం. ఇలా మన రోజువారి జీవితంలో కాఫీ ఒక భాగమైపోయింది. అయితే, కొందరికి కాఫీచేదుగా లేకపోయినా కూడా ఆ భావన కలుగుతుంటుంది. దీనికి గల కారణాలను ఇటీవల ఓ పరిశోధనలో శాస్త్రవేత్తలు వెలుగులోకి తెచ్చారు. ఆ వివరాలు మీ కోసం!
కాఫీ చేదుగా అనిపించడానికి గల కారణాలను జర్మనీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కాఫీ తాగే వ్యక్తి జన్యు లక్షణాలు ఇందుకు దోహదపడుతున్నట్లు తేల్చారు. ఈ అధ్యయనంలో భాగంగా కాఫీయా అరబికా మొక్క నుంచి సేకరించిన గింజలను శాస్త్రవేత్తలు రోస్ట్ చేశారు. వాటిని పౌడర్‌గా మార్చి, కాఫీని రెడీ చేశారు. కాఫీలోని కెఫీన్ చాలా చేదుగా ఉంటుందన్నది అందరికీ తెలిసిందే. అయితే దీన్ని తొలగించిన కాఫీ కూడా చేదుగానే ఉంటోందని గుర్తించారు. దీన్నిబట్టి రోస్టెడ్ కాఫీలో చేదుకు ఇతర పదార్థాలూ కారణమవుతున్నట్లు స్పష్టమవుతోందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఇందులో మొజాంబియోసైడ్ కూడా ఉంది. కెఫీన్‌తో పోలిస్తే ఇది 10 రెట్లు అధికంగా చేదుగా అనిపిస్తుంది. ఇది మన బాడీలో చేదుకు సంబంధించిన టీఏఎస్2ఆర్43, టీఏఎస్2ఆర్46 అనే రెండు రకాల గ్రాహకాలను క్రియాశీలం చేస్తుంది. అయితే కాఫీ గింజలను రోస్ట్ చేసేటప్పుడు మొజాంబియోసైడ్ తీవ్రత గణనీయంగా తగ్గుతున్నట్లు కనుగొన్నారు. అందువల్ల కాఫీ చేదుగా ఉండటానికి అది స్వల్పంగానే కారణమవుతున్నట్లు గుర్తించారు.