Viral Pregnancy Discrimination Case UK :ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తొలినాళ్లలో వేవిళ్ల సమస్య మహిళల్ని ఎంతలా ఇబ్బంది పెడుతుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వాంతులు, వికారం, నీరసం, అలసట వంటి లక్షణాలు వేధించే ఇలాంటి టైమ్‌లో ఆఫీసుకెళ్లి విధులు నిర్వర్తించడం సవాలే! అందుకే కొన్నాళ్ల పాటు వర్క్‌ఫ్రమ్ హోమ్ చేస్తానని తమ బాస్‌ని కోరిందో మహిళా ఉద్యోగి. అందుకు ఆయన నిరాకరించడంతో పాటు వెకిలిగా స్పందిస్తూ ఆమెను జాబ్‌లో నుంచి తొలగించాడు.
పని ప్రదేశంలో ఇలాంటి వివక్షను భరించలేకపోయిన ఆ మహిళ తనకు న్యాయం చేయాలంటూ కోర్టును ఆశ్రయించింది. కేసు పూర్వాపరాలు పరిశీలించిన కోర్టు సదరు సంస్థనే దోషిగా తేల్చింది. గర్భధారణను సాకుగా చూపి జాబ్‌లో నుంచి తొలగించడం చట్ట విరుద్ధమని చెబుతూనే, సదరు మహిళకు నష్ట పరిహారం కూడా చెల్లించాలని ఆదేశించింది. ఎన్నో ఏళ్లు గడుస్తోన్నా నేటికీ పని ప్రదేశంలో మహిళలపై లింగ వివక్షకు మాత్రం తెరపడట్లేదనడానికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోన్న ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వేవిళ్లు వేధిస్తున్నాయి!
పౌలా మిలుస్కా- యూకేకు చెందిన ఈ మహిళ బర్మింగ్‌హామ్‌లోని ఓ కంపెనీలో ఇన్వెస్ట్‌మెంట్ కన్సల్టెంట్గా జాబ్ చేసేది. 2022 మార్చిలో ఈ జాబ్‌లో చేరిన ఆమె, అదే ఏడాది అక్టోబర్‌లో గర్భం దాల్చింది. అయితే మొదటి త్రైమాసికంలో వేవిళ్లు ఆమెను చాలా ఇబ్బంది పెట్టాయి. దాంతో ఆఫీసుకెళ్లి విధులు నిర్వర్తించడం ఆమెకు కష్టంగా మారింది. అందుకే కొన్నాళ్ల పాటు ఇంటి నుంచే పనిచేస్తానంటూ, అందుకు తనకు అనుమతివ్వాలని కోరుతూ తన బాస్కి వినయపూర్వకంగా సందేశం పంపిందామె.
'డియర్ సర్- ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్. వేవిళ్లు, అలసటతో చాలా ఇబ్బంది పడుతున్నా. శరీరంలో హార్మోన్లలో మార్పుల కారణంగా వచ్చే 2 వారాలూ ఈ సమస్య ఎక్కువగా ఉంటుందని మా ఫ్యామిలీ డాక్టర్ తెలిపారు. నా ఆరోగ్యం, కడుపులో పెరుగుతున్న బిడ్డ సంక్షేమం, వంటి విషయాల్లో నిర్లక్ష్యం వహించకపోవడమే మంచిదని సూచించారు. అందుకే కొన్నాళ్ల పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు కల్పించమని కోరుతున్నా' అంటూ బాస్‌ని అడిగింది పౌలా.
తిరస్కరణకు తోడు!
అయితే పౌలా మెసేజ్‌కి ఆలస్యంగా స్పందించిన బాస్, ఆమె ఆరోగ్య సమస్యల్ని పరిగణనలోకి తీసుకోలేదు. పైగా 'రోజంతా వాంతులు, వికారం, నీరసం వంటి లక్షణాలు వేధిస్తున్నప్పుడు దాన్ని 'మార్నింగ్ సిక్‌నెస్' అని ఎందుకంటారు?' అంటూ వెకిలిగా ప్రశ్నించాడు. ఆమె వర్క్ ఫ్రమ్ హోమ్ రిక్వెస్ట్‌ని తిరస్కరించాడు. పైగా 'వచ్చే వారం నేను హాలిడేకు వెళ్తున్నా. అందువల్ల ఈ వీక్ మొత్తం ఆఫీసుకొచ్చి త్వరగా పని పూర్తి చేసుకోవడం మీకు వీలవుతుందా?' అనడిగాడు బాస్.