Satvik Thali Recipes For Ayyappas in Telugu : కార్తిక మాసంలో పూజలు ఎక్కువగా చేసేవారు ఉల్లి, వెల్లుల్లి లేని ఆహారం తీసుకుంటారు. అలాగే.. అయ్యప్ప మాలధారులు కూడా ఉల్లి, వెల్లుల్లి లేని సాత్విక భోజనాన్ని తీసుకుంటుంటారు. ఈ క్రమంలో వీరికి అనువుగా ఉండే సాత్విక భోజనాన్ని ఈజీగా ఎలా తయారు చేయాలో ఈ కథనంలో చూద్దాం.
ముద్దపప్పు తయారీకి కావాల్సిన పదార్థాలు :
- కంది పప్పు-కప్పు
- ఉప్పు-రుచికి సరిపడా
- పసుపు-పావు టీస్పూన్
- నెయ్యి-టేబుల్‌స్పూన్
- ఇంగువ-రెండు చిటికెలు
- జీలకర్ర-అరటీస్పూన్
- నీరు
తయారీ విధానం :
- ముందుగా స్టౌపై పాన్ పెట్టి కందిపప్పు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో ఉంచి కందిపప్పు దోరగా సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి.
- వేయించిన కందిపప్పుని ఒకసారి కడిగి కుక్కర్లో వేసుకోండి. ఇందులో పసుపు, రెండున్నర గ్లాసుల నీటిని పోయాలి.
- ఆపై కుక్కర్ మూత పెట్టి సన్నని మంటమీద 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి.
- పప్పు ఉడికిన తర్వాత ఆవిరి పోయేంత వరకు మూత తీయకుండా అలానే ఉంచాలి.
- ఇప్పుడు పప్పు గుత్తితో పప్పును మెదుపుకోండి. పప్పులో నుంచి పావు కప్పు పప్పు తీసి పక్కన పెట్టండి. (ఈ పప్పుతో వాము చారు చేసుకోవచ్చు)
- ముద్దపప్పు తాలింపు కోసం.. స్టౌపై పాన్ పెట్టండి. ఇందులో నెయ్యి వేసి కరిగించండి. ఆపై జీలకర్ర, ఇంగువ వేసి ఫ్రై చేయండి.
- తర్వాత మెదుపుకున్న పప్పు వేసి బాగా మిక్స్ చేయండి. ఇందులో కొన్ని నీళ్లు పోసి, ఉప్పు వేసి కలపండి. 5 నిమిషాల తర్వాత స్టౌ ఆఫ్ చేస్తే సరిపోతుంది.
- కమ్మటి ముద్దపప్పు సిద్ధమైపోయింది.
బెండకాయ వేపుడుకి కావాల్సిన పదార్థాలు :
- బంగాళదుంపలు-2
- బెండకాయలు -పావు కేజీ
- ఎండుమిర్చి-2
- ఆవాలు-అరటీస్పూన్
- జీలకర్ర-అరటీస్పూన్
- కరివేపాకు-2
- ఇంగువ-రెండు చిటికెలు
- నూనె-3 టేబుల్‌స్పూన్లు
- పచ్చిమిర్చి-2
- పసుపు-పావు టీస్పూన్
- ఉప్పు -రుచికి సరిపడా
- ధనియాల పొడి-టీస్పూన్
- కారం -టీస్పూన్
తయారీ విధానం :
- ముందుగా బంగాళాదుంపలను కడిగి పైన పొట్టు తీసుకోండి. ఆపై సన్నని ముక్కలుగా కట్ చేసుకోండి.
- అలాగే బెండకాయలు శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోండి.
- ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టి నూనె వేసి వేడి చేయండి. ఇందులో ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసి ఫ్రై చేయండి. ఆపై ఇంగువ, కరివేపాకు వేసి వేయించండి.
- తర్వాత బంగాళాదుంప ముక్కలు, పచ్చిమిర్చీలు వేసి ఫ్రై చేయండి.
- ఇప్పుడు మూత పెట్టి 8 నిమిషాలు మగ్గించండి. తర్వాత బెండకాయ ముక్కలు వేసి కలుపుకోండి.
- స్టౌ మీడియం ఫ్లేమ్‌లో ఉంచి బెండకాయ ముక్కలను 15 నిమిషాలు మగ్గించుకోండి.
- ఆపై పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కలుపుకోండి. 5 నిమిషాల తర్వాత వేపిన ధనియాల పొడి, కారం వేసి మరోసారి కలుపుకోండి.
- ఒక నిమిషం తర్వాత కాస్త కొత్తిమీర తరుగు చల్లి స్టౌ ఆఫ్ చేయండి.
- అంతే ఇలా చేస్తే రుచికరమైన బెండకాయ వేపుడు రెడీ.