Pichuka Gullu Sweet Recipe : ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లా అంటే అందరికీ గుర్తొచ్చేది పచ్చని పంటపొలాలు, ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు అదరగొట్టే రుచులు. ఇక్కడి వంటకాలను టేస్ట్ చేస్తే ఫిదా కావాల్సిందే. అందులోనూ ఇక్కడ దొరికే కరకరలాడే పిచ్చుక గూళ్లకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అదేంటి? పిచ్చుక గూళ్లను తినడమేంటని ఆశ్చర్యంగా చూస్తున్నారా? అయితే కోనసీమ రుచుల సంగతేంటో తెలుసుకోవాల్సిందే.
కోనసీమలో తయారయ్యే 'గర్రాజులు' అనే ఈ వంటకం రుచి తీయగా ఉంటుంది. ఆకారం మాత్రం పిచ్చుక గూళ్లను పోలి ఉండటంతో ఇక్కడి వారంతా దీనిని పిచ్చుక గూళ్లు అని పిలుస్తారట. 216 జాతీయ రహదారికి ఇరువైపులా నగరం నుంచి మామిడికుదురు వరకు దాదాపు 70 వరకు దుకాణాల్లో ఈ గర్రాజుల (పిచ్చుక గూళ్లు)ను తయారు చేస్తూ విక్రయిస్తుంటారు. ఆ వైపుగా వెళ్లే వాహనచోదకులు, ప్రయాణికులు వీటిని టేస్ట్ చేయకుండా ఉండలేరు! ఏవైనా పండుగలు, శుభకార్యాలు జరిగితే ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి మరీ విందులో వీటిని ఏర్పాటు చేస్తుంటారు.
ఎలా తయారు చేస్తారంటే..? ఈ గర్రాజులను తయారు చేసేందుకు ముందుగా బియ్యాన్ని నానబెడతారు. నానబెట్టిన ఆ బియ్యాన్ని పిండిగా చేసుకుని, పంచదార లేదా పాకం పట్టిన బెల్లం అందులో కలిపి ధారగా పడేలా పల్చగా కలుపుకుంటారు. ఆ మిశ్రమాన్ని బాగా కాగిన నూనెలో రంధ్రాలున్న నిలువు చట్రం ద్వారా పిండిని తిప్పుతూ గుండ్రంగా వచ్చేలా అందులో పోస్తారు. కొంచెం వేగిన తర్వాత దానిని అర్ధ చంద్రాకారంలో మలిచి, దోరగా వేగే వరకు ఉంచుతారు. ఆ తర్వాత నూనెలో నుంచి తీసేస్తే కరకరలాడే గర్రాజులు రెడీ అయిపోయినట్లే.
నోట్లో వేస్తే కరిగిపోయే "కమ్మని కలాకండ్" - ఇలా చేస్తే అచ్చం స్వీట్ షాప్ టేస్ట్!