Young Man Carved Wonderful Sculptures in Prakasam District : చిత్రకళమీద ఉన్న ఆసక్తే అతడిని శిల్పకారుడిని చేసింది. తన బంధువులు ఉలితో అద్భుతాలు సృష్టించడాన్ని కళ్లరా చూసిన అతను, తానూ కూడా శిలలపై శిల్పాలు చెక్కాలని తపించాడు. ఆ ఆసక్తే అతనికి ఉపాధి అయ్యింది. మరో పదిమందికి ఉపాధినిచ్చింది. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన యువ శిల్పకారుడు దుర్గారావు శిల్పకళలో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ, నల్లని రాయిపై ప్రతిమలకు ప్రాణం పోస్తున్నాడు.
కఠినమైన వృత్తిని ఉపాధిగా :ఉలితో అందమైన దేవతామూర్తుల విగ్రహాలు చెక్కుతూ అందరిని ఆశ్చర్య పరుస్తున్నాడు దుర్గారావు. ఒంగోలుకు చెందిన ఈ యువకుడు పదో తరగతి వరకు చదువుకున్నారు. దుర్గారావుకు చిన్నప్పటి నుంచి చిత్రకళపై ఆసక్తి. సరదా కోసం బొమ్మలు గీసేవారు. దీన్ని గమనించిన సమీప బంధువులు శిల్పకళపై దృష్టిపెట్టేలా ప్రోత్సహించారు. కఠినమైన ఈ వృత్తిని ఉపాధిగా మార్చుకొనే వారు చాలా అరుదు. కానీ దుర్గారావు ఈ కళపై ఆసక్తితో టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న తిరుపతి శిల్పకళాక్షేత్రంలో డిప్లొమా పూర్తి చేశారు. శాస్త్రీయంగా శిల్పాన్ని చెక్కడంలో ఉన్న అన్ని మెళకువలూ నేర్చుకున్నారు. దేవాలయాల్లో పూజలందుకునే దేవతా విగ్రహాల తయారీలో ప్రావీణ్యం సాధించారు. ఆయన ఉలి వేసి చెక్కిన శిల్పాలు ప్రాణం పోసుకున్నంత కళాత్మకంగా దర్శనమిస్తాయి.
స్టీరింగ్ పట్టిన అనంత అమ్మాయి - ఆర్టీసీలో చేరేందుకు శిక్షణ - Anantapur Lady Driver
స్థానికులకు ఉపాధి : టీటీడీలో డిప్లొమా పొందిన వారికి దుర్గారావు ఉపాధి కల్పిస్తున్నారు. తన సొంత గ్రామంలో శిల్పకళా క్షేత్రం ఏర్పాటు చేస్తే తన ఊరికి ఖ్యాతి తేవడంతో పాటు, మరికొంత మంది స్థానికులకు ఉపాధి కల్పించవచ్చన్న ఉద్దేశంతో ఒంగోలులోనే క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. ఓ ప్రైవేటు స్థలం లీజుకు తీసుకొని అక్కడ శిల్పాలు చెక్కుతున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి దుర్గారావుకు ఆర్డర్లు వస్తుంటాయి. గతంలో శిల్పాలను ఉలి, సుత్తిని మాత్రమే వినియోగించి చెక్కేవారని కాలక్రమంలో యంత్ర సామగ్రి, విద్యుత్తు పనిముట్లు రావడంతో తమ పని సులువైందని దుర్గారావు చెబుతున్నారు. అందమైన జీవకళ ఉట్టిపడేటట్లు శిల్పాలు చెక్కాలంటే ఎంతో ఏకాగ్రత అవసరమంటున్నారు.