How to Make Instant Poornam Boorelu :దేశవ్యాప్తంగా అక్టోబర్ 3 నుంచి దేవీ శరన్నవరాత్రులు మొదలుకానున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా 9 రోజులు.. 9 అలంకారాలతో దర్శనమిచ్చే అమ్మను చూసి తరిస్తాం. కోరిన కోర్కెలు తీర్చే ఆ కరుణామయికి రకరకాల రుచికరమైన నైవేద్యాలు సమర్పిస్తాం. ఈ నేపథ్యంలోనే మీకోసం ఒక స్పెషల్ స్వీట్ రెసిపీ తీసుకొచ్చాం. అదే.. ఇన్స్టంట్ పూర్ణం బూరెలు. పప్పులు నానబెట్టే పనిలేకుండా చాలా తక్కువ సమయంలో వీటిని ఈజీగా ప్రిపేర్ చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించొచ్చు. ఇంతకీ, వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు :
స్టఫింగ్(పూర్ణం) కోసం :
- వేయించిన పుట్నాల పప్పు - అర కప్పు
- కొబ్బరి తురుము - 1 కప్పు
- బెల్లం తురుము - అర కప్పు
- వాటర్ - పావు కప్పు
- నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
- యాలకుల పొడి - పావు టీస్పూన్
కోటింగ్ కోసం :
- గోధుమపిండి - 1 కప్పు
- బియ్యప్పిండి - పావు కప్పు
- ఉప్పు - చిటికెడు
- పంచదార - 1 టీస్పూన్
- వాటర్ - ఒకటిన్నర కప్పు
- వంటసోడా - పావు టీస్పూన్
- నూనె - వేయించడానికి తగినంత
తయారీ విధానం :
- ఈ రెసిపీలోకి మొదటగా స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం ముందుగా మిక్సీ జార్లో వేయించిన పుట్నాలు తీసుకొని కాస్త బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
- ఆతర్వాత అదే మిక్సీ జార్లో పచ్చికొబ్బరి ముక్కలు వేసుకొని 1 కప్పు పరిమాణంలో తురుములా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పడు స్టౌపై పాన్ పెట్టుకొని బెల్లం వేసుకొని వాటర్ పోసుకోవాలి. ఆపై మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి గరిటెతో కలుపుతూ బెల్లం పూర్తిగా కరిగే వరకు మరిగించుకోవాలి. అంతేకానీ.. పూర్తిగా పాకం రావాల్సిన పనిలేదు.
- ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువగా ఉండాలనుకుంటే మరో రెండు టేబుల్స్పూన్ల బెల్లం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. బెల్లం ఆవిధంగా మరిగాక పాన్‌ను దించి పక్కన పెట్టేసుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై మరో పాన్‌ను పెట్టుకొని 1 టేబుల్‌స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అది పూర్తిగా కరిగాక ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుమును వేసి మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి 2 నుంచి 3 నిమిషాల పాటు వేయించుకోవాలి.
- ఆ తర్వాత మిక్సీ పట్టుకున్న పుట్నాల పొడినీ అందులో వేసుకొని కలుపుతూ మరో నిమిషం పాటు వేయించుకోవాలి.
- ఆవిధంగా వేయించుకున్నాక.. అందులో మరిగించి పక్కన పెట్టుకున్న బెల్లం వాటర్‌ని జల్లీతో వడకట్టుకొని పోసుకోవాలి.
- ఆపై మంటను లో ఫ్లేమ్‌లోనే ఉంచి మిశ్రమం కాస్త గట్టిపడే వరకు గరిటెతో కలుపుతూ వేయించుకోవాలి. మరీ ఎక్కువగా గట్టిపడే వరకు ఉంచకూడదు.
- మిశ్రమం కాస్త గట్టిపడిందనుకున్నాక.. అందులో మరో టేబుల్‌స్పూన్ నెయ్యి, యాలకుల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చేతితో పట్టుకుని చూస్తే ఉండలా రావాలి. అలా వచ్చేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి. ఆవిధంగా వచ్చాక స్టౌ ఆఫ్ చేసుకొని పాన్‌ను దించుకోవాలి.
- ఆ తర్వాత మిశ్రమం చేతితో పట్టుకోవడానికి వీలుగా కాస్త చల్లారాక కొద్దిగా కొద్దిగా తీసుకుంటూ ఉండలు చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
- ఇప్పుడు కోటింగ్ కోసం పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం.. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో గోధుమపిండి, బియ్యప్పిండి, ఉప్పు, పంచదార వేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి.
- అయితే.. పిండి అనేది దోశల పిండి కంటే కాస్త మందంగా ఉండేలా చూసుకోవాలి. ఆవిధంగా కలుపుకున్నాక అందులో వంటసోడా వేసి మరోసారి కలిపి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై.. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కాక.. కలిపి పెట్టుకున్న పిండిలో ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి తురుము ఉండలు డిప్ చేసి ఒక్కొక్కటిగా కాగుతున్న నూనెలో వేసుకోవాలి.
- ఆపై మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి అవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ప్లేట్లోకి తీసుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే "పూర్ణం బూరెలు" రెడీ!
- అనంతరం వాటిని ప్లేట్లోకి తీసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి.
ఇవీ చదవండి :
నవరాత్రి స్పెషల్ : అమ్మవారు మెచ్చే "నువ్వులన్నం" - ఇలా ప్రిపేర్ చేసి నైవేద్యంగా పెట్టండి!
గుడిలోని ప్రసాదమంత టేస్టీ పులిహోర ఇంట్లోనే! - ఈ చిన్న టిప్స్ పాటిస్తే అద్భుత రుచిని అస్వాదిస్తారు!