Prevention Of Kids Accidents At Home : చిన్నపిల్లలు ఆద్యంతం ఉత్సుకతతో ఉంటారు. వారికి కొత్తగా ఏ వస్తువు కనిపించిన చేతితో తాకడం కానీ, నోటీతో రుచి చూడటం చేస్తుంటారు. కొన్నిసార్లు మనం ఇంట్లో సాధారణంగా ఉపయోగించే వస్తువులు పిల్లలలకు ప్రాణాంతకం కావచ్చు. ఇంట్లో పిల్లల సంరక్షణపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ కింది వాటిని పిల్లలకు దూరంగా ఉంచడం శ్రేయస్కరం.
నీటి వేడి పరికరాలతో ప్రమాదం :మన ఇంట్లోనీటిని వేడిచేసేందుకు హీటర్లు వాడుతాం. ఇవీ చాలా ప్రమాదకరం. పిల్లలు తిరిగే చోట వీటిని అస్సలు ఉంచకూడదు. ఏదైనా గదిలో హీటర్‌తో నీటిని వేడి చేస్తుంటే తలుపులను మూసేసి గడియ పెట్టాలి. పిల్లల కంటపడకుండా చూడాలి. హీటర్ ఆన్‌లో ఉన్నప్పుడు అనుకోకుండా నీటిలో చేయిపెట్టినా ప్రాణాలకే ప్రమాదం. చిన్న పిల్లలు ఉండే ఇళ్లలో గ్యాస్ పొయ్యిపై నీటిని వేడి చేసుకోవడం లేదా గీజర్ ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం.
పురుగు మందులు, రసాయనాలు :సాధారణంగా పల్లెటూర్లలోరైతుల ఇళ్లల్లో పంటల పురుగు మందులు, వాటి పాత డబ్బాలు ఉంటాయి. వాటిపై లేబుల్స్ ఆకర్షణీయంగా ఉండటంతో పిల్లలు నోట్లో పెట్టుకుని ప్రాణాలు కోల్పోతున్నారు. పెస్టిసైడ్స్‌ను ఇంట్లో పెట్టొద్దు. కొందరు చిన్నారులు ఆసిడ్, ఇంటిని శుద్ధి చేసే రసాయనాలు తాగుతున్నారు. వాటిని చిన్నారులకు కనిపించకుండా ఉంచాలి.
విద్యుత్తు మీటలు కిందికి ఉంటే :ఇటీవలి కాలంలోకొత్త ఇళ్లల్లో పడకలకు సమాన ఎత్తులో విద్యుత్తు స్విచ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఫోన్లకు ఛార్జింగ్ పెట్టే స్విచ్చ్‌లలో చిన్నారులు ఇనుప మేకులు, తీగలు పెడితే షాక్‌కు గురయ్యే ప్రమాదముంది. తడి చేతులతో ముట్టుకున్నా ప్రమాదమే. స్విచ్ఛ్‌లను ప్లాస్టర్లతో మూసేయాలి. అలాగే ఫోన్ ఛార్జింగ్ తీసేసాక వైర్‌ను బోర్డుకు పెట్టి ఉంచకూడదు.
నీటి గుంతలతో ముప్పు :ఇంట్లో నీటిని నిల్వ చేసే సంపులు చిన్నారుల పాలిట యమగండాలుగా మారుతున్నాయి. చాలామంది సంపులలో పడి మృతి చెందుతున్నారు. ఈ నేపథ్యంలో సంపులపై అంత సులభంగా పక్కకు తొలగని ఇనుప మూతలు ఏర్పాటు చేసుకోవాలి. వాటిపై మూతలను తొలగించకూడదు. పిల్లలను ఎప్పుడూ ఓ కంట కనిపెడుతూనే ఉండాలి.