LIC unsettled claim amount :'నేను లేకపోయినా నా కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడొద్దు'అనే ఉద్దేశంతో ఎంతో మంది బీమా పాలసీ తీసుకుంటారు. అందులోనూ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) పాలసీ తీసుకున్నవారే ఎక్కువగా ఉంటారు. కానీ, చాలా మంది ఇన్సూరెన్స్ తాలూకూ విషయాల్లో నిర్లక్ష్యంగా ఉంటున్నారు. పాలసీ తీసుకున్న విషయం కూడా కుటుంబ సభ్యులతో చెప్పకపోవడం సమస్యగా మారింది. పాలసీదార్లు క్లెయిమ్ చేయని డబ్బు భారతీయ జీవిత బీమా సంస్థ వద్ద కొన్ని వందల కోట్లు ఉంది. 2023- 2024 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.880.93 కోట్ల మెచ్యూరిటీ డబ్బు ఉందని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఇది గడిచిన ఐదేళ్లలో 3,726 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం.
జీవిత బీమా తీసుకునే వారిలో గ్రామీణ నేపథ్యం కలిగిన నిరక్షరాస్యులు ఎంతో మంది ఉన్నారు. వారికి పాలసీల గురించి, వాటిని క్లైయిమ్ చేసుకోవడంపై పెద్దగా అవగాహన లేదు. మరికొంత మంది పాలసీ విషయం తమ కుటుంబ సభ్యులకు చెప్పే వాళ్లు కాదు. అలాంటి సందర్భాల్లో పాలసీ తీసుకున్న వ్యక్తి మరణించినప్పుడు ఎల్‌ఐసీ నుంచి డబ్బు వస్తుందన్న విషయం కూడా ఆ కుటుంబ సభ్యులకు తెలిసేది కాదు. ఇలా పాలసీదారులు క్లయిమ్ చేయని డబ్బు చాలా ఉంది.
అల్యూమినియం పాత్రల్లో వంట ప్రమాదకరమా? - డాక్టర్లు ఏం చెప్తున్నారంటే!
క్లయిమ్ చేయని డబ్బు ఎల్‌ఐసీ దగ్గరే ఎక్కువ
ఎల్‌ఐసీ మన దేశంలో అతి పెద్ద, ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ కావడంతో కోట్లాది మంది ప్రజలు పాలసీలు తీసుకున్నారు. గతంలో కుటుంబ పెద్దలు మాత్రమే ఎల్‌ఐసీ పాలసీలు తీసుకునేవాళ్లు. అలాంటి సందర్భాల్లో పాలసీ కొన్న వ్యక్తి హఠాత్తుగా మరణించినప్పుడు కుటుంబ సభ్యులు క్లయిమ్ కోసం దరఖాస్తు చేయకపోవడంతో పెద్ద మొత్తంలో డబ్బు అలాగే ఉండిపోయింది. పాలసీ ఉందన్న విషయం తెలియక కుటుంబ సభ్యులు సెటిల్ చేసుకోకపోవడం, మరి కొందరు పాలసీహోల్డర్లు జీవించి ఉన్నా కొన్నాళ్లు కిస్తీలు చెల్లించి వదిలేయడం ఇలా పలు కారణాలతో దశాబ్దాలుగా ప్రజలు క్లెయిమ్ చేయని డబ్బు ఎల్‌ఐసీ దగ్గర కుప్పలుతెప్పలుగా పేరుకుపోయింది.