Legal Advice on Family Problem :తన భర్త మరో మహిళతో సహజీవనం చేస్తూ కుటుంబానికి దూరంగా ఉన్నాడు. ఇటీవల వారిద్దరూ రోడ్డు ప్రమాదంలో మరణించారు. అయితే.. వారిద్దరూ కలిసి సంపాదించిన ఆస్తి ఉంది. అది తన పిల్లలకు దక్కుతుందా? అని న్యాయ నిపుణుల సహాయం కోరుతోంది భార్య. మరి, న్యాయనిపుణులు ఎలాంటి సలహాలు, సూచనలు అందించారో ఇప్పుడు చూద్దాం..
ఇదీ సమస్య..
"మాకు ఇద్దరు పిల్లలు. మా వారు వ్యాపారం చేసేవారు. ఆయన నాకు విడాకులు ఇవ్వకుండానే మరో మహిళతో సహజీవనం చేశారు. ఆమె తన భర్తకు విడాకులు ఇచ్చి మా ఆయనతో ఉండేది. ఈ మధ్య జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో మా ఆయన, ఆమె ఇద్దరూ చనిపోయారు. అయితే.. అంతకు ముందు ఆ మహిళ, నా భర్త జాయింట్ ప్రాపర్టీగా కలిసి ఒక ఫ్లాట్ కొన్నారు. ఇప్పుడు అది మా పిల్లలకు వచ్చే అవకాశం ఉందా? నాకు చిన్న ఉద్యోగం తప్ప ఎలాంటి ఆధారమూ లేదు. నేను ఏం చేయాలి?" అంటూ ఓ సోదరి న్యాయ నిపుణులు సలహా కోరుతున్నారు. ఈ సమస్యకు ప్రముఖ న్యాయవాది జి. వరలక్ష్మి ఎలాంటి సమాధానం ఇచ్చారంటే..
వీలునామా రాయకపోతే మాత్రమే..
మీ వారు చేసిన సహజీవనానికి చట్టబద్ధత లేదు. అయితే, వారు కొన్న ఫ్లాట్ ఎవరి సంపాదనతో తీసుకున్నారో తెలియాలి. సాధారణంగా జాయింట్ ప్రాపర్టీ ఏదైనా కూడా.. ఆస్తి ఇద్దరికీ సమానంగా చెందుతుంది. అయితే.. మీ భర్త ఎవరికైనా వీలునామా రాస్తే ఆ ఆస్తి వారికి దక్కుతుంది. ఒకవేళ రాయకపోతే మాత్రం ఆయన వాటా మీకు దక్కాలని మీరు కోరవచ్చు. ఆస్తిలోని ఆయన భాగాన్ని మీ పేరిట మ్యూటేషన్ చేయించుకోవచ్చు.