How to Make Onion Curry at Home : ఇంట్లో కూరగాయలు ఏమీ లేకుండా కేవలం ఆనియన్స్ మాత్రమే ఉన్నప్పుడు.. వాటితో కూడా అద్దిరిపోయే కర్రీ చేసుకోవచ్చు. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్‌కు అయితే ఇది చాలా బెస్ట్ రెసిపీ. ఈ కర్రీని అన్నంతోపాటు చపాతీ, పూరీ, పరోటా ఇలా ఎందులోకైనా అద్దిరిపోతుంది. మరి ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం..
కావాల్సిన పదార్థాలు:
- ఉల్లిపాయలు - 4 (మీడియం సైజ్)
- నూనె - మూడు టేబుల్ స్పూన్లు
- ఆవాలు - అర టీ స్పూన్
- జీలకర్ర - అర టీ స్పూన్
- కరివేపాకు - 2 రెమ్మలు
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
- పసుపు - పావు టీ స్పూన్
- కారం - తగినంత
- ఉప్పు - తగినంత
- ధనియాల పొడి - 1 టేబుల్ స్పూన్
- జీలకర్ర పొడి - పావు టీ స్పూన్
- గరం మసాలా - పావు టీ స్పూన్
- వేయించిన మెంతుల పొడి- చిటికెడు
తయారీ విధానం:
- ముందుగా ఉల్లిపాయలను పొట్టు తీసి సన్నగా, పొడుగ్గా కట్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి.
- నూనె హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి.
- ఆ తర్వాత ఉల్లిపాయలు వేసి మంటను లో ఫ్లేమ్‌లో పెట్టి ఓ రెండు నిమిషాలు వేయించుకోవాలి.
- ఆ తర్వాత కరివేపాకు, ఉప్పు వేసి కలిపి మూత పెట్టి మరో నాలుగు నిమిషాలు ఉల్లిపాయలు మెత్తగా అయ్యేంతవరకు మగ్గించుకోవాలి.
- ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంతవరకు వేయించుకోవాలి. ఆ తర్వాత పసుపు వేసి కలిపి మరికొన్ని నిమిషాలు వేయించుకోవాలి.
- ఉల్లిపాయలు మెత్తగా మగ్గించుకున్న తర్వాత కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, వేయించుకున్న మెంతుల పొడి వేసి కలుపుకోవాలి. ఈ పొడులన్నీ మార్కెట్లో దొరుకుతాయి. ఒకవేళ మీ దగ్గర మెంతుల పొడి లేకపోతే స్కిప్ చేయవచ్చు.
- ఈ మసాలా పొడులన్నీ మాడిపోకుండా ఓ మూడు నిమిషాలు వేయించుకుని దించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ కర్రీ రెడీ.
- అయితే కూర మొత్తాన్ని కూడా స్టౌ లో-ఫ్లేమ్‌లో ఉంచుకునే ప్రిపేర్ చేసుకోవాలి.
- దీన్ని వేడి వేడి అన్నంలోకి కలుపుకుని తింటే చాలా బాగుంటుంది.
- మీ ఇంట్లో ఎప్పుడైనా కూరగాయలు లేకపోతే ఓ సారి ఇది ట్రై చేయండి..