Health Benefits of Drinking Ragi Malt :ఒక గ్లాసు రాగిజావ పోషకాలపరంగా 3 గ్లాసుల పాలతో సమానమని, పిల్లలకు రాగిజావ, జొన్నరొట్టె చిన్నతనం నుంచే అలవాటు చేయాలని భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ (ఐఐఎంఆర్) డైరెక్టర్ సి.తారా సత్యవతి సూచించారు. హరిత విప్లవం మాదిరిగా మన దేశంలో చిరుధాన్యాల విప్లవం రావాలని ఆకాంక్షించారు. ప్రతిఒక్కరూ రోజువారీ ఆహారంలో మూడో వంతు చిరుధాన్యాలు ఉండేలా చూసుకుంటే సంపూర్ణ ఆరోగ్యంతో జీవించవచ్చని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో సైన్యానికి ఇచ్చే ఆహారంలోనూ 25% చిరుధాన్యాలను వినియోగిస్తోందని, ఈ చైతన్యం అందరిలోనూ రావాలని తెలిపారు. ఆదివారం ఐఐఎంఆర్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆమె 'ఈనాడు'తో స్పెషల్గా మాట్లాడారు. ప్రజాపంపిణీ వ్యవస్థలోనూ వీటిని అందించాలని సూచించారు. రైతులకు ప్రధాన పంటల కంటే చిరుధాన్యాల సాగు లాభదాయకమని డాక్టర్ తారా సత్యవతి పేర్కొన్నారు. ఇంకా ఏమన్నారో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.
దేశంలో చిరుధాన్యాల స్థితిగతులు ఎలా ఉన్నాయి?
ప్రస్తుతం చిరుధాన్యాలపై ప్రజల్లో చైతన్యం కనిపిస్తోంది. అలాగే సాగు పెరుగుతోంది. 2023 అంతర్జాతీయ చిరుధాన్యాల దినోత్సవం అనంతరం వాటి ప్రాధాన్యాన్ని అందరూ గుర్తిస్తున్నారు. వీటితో విభిన్న రకాల ఆహార ఉత్పత్తులు నేడు మార్కెట్లో అందుబాటులోకి వస్తున్నాయి. వాటి కొనుగోళ్లకు మార్కెట్లోనూ డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. ప్రస్తుతం దేశంలో 18-20 మిలియన్ టన్నుల మేర ఉత్పత్తి జరుగుతోంది.
సాగు ఆశించిన స్థాయిలో పెరుగుతోందా?
ప్రస్తుతం రైతుల్లో క్రమేపీ మార్పు వస్తోంది. దేశంలో చిరుధాన్యాల సాగు 2022-23లో 13.6 మిలియన్ హెక్టార్లలో జరగగా అది ఇప్పుడు 13.9 మిలియన్ హెక్టార్లకు చేరింది. దేశంలో చిరుధాన్యాల సాగుకు అనుకూల పరిస్థితులున్నాయి. మార్కెట్లో విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం జొన్నలు, సజ్జలు, రాగులకు మద్దతు ధరలను ప్రకటించింది. ప్రధాన పంటలతో పోలిస్తే వీటికి వాటర్ వినియోగం చాలా తక్కువ. ధాన్యం కిలో పండించడానికి సుమారు 2 వేల లీటర్లు, చెరకుకు 4 వేల లీటర్లు అవసరమైతే సజ్జలు, జొన్నలు పండించడానికి కేవలం 350 లీటర్ల నీరు సజ్జలు. గోధుమ, వరి, మొక్కజొన్న వంటి పంటలు అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోలేవు. చిరుధాన్యాలు తీవ్రమైన ఎండలను కూడా తట్టుకొని సాగవుతాయి. ప్రస్తుతం చిరుధాన్యాలను ఆహారంగానే కాక దాణాగానూ ఉపయోగిస్తున్నారు. బయో ఇంధన తయారీ కూడా మొదలైంది.
ప్రతికూల పరిస్థితులు లేవా?
కేంద్రంతోపాటు ఛత్తీస్‌గఢ్ వంటి కొన్ని రాష్ట్రాలు చిరుధాన్యాలకు మద్దతు ధర ప్రకటించాయి. కానీ, ఇదొక్కటే సరిపోదు. ప్రస్తుతం సరైన మార్కెట్ లేక రైతులు తమ ఉత్పత్తులను వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. వినియోగదారులకు మాత్రం ఇవి అధిక ధరకు లభిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిరుధాన్యాల సేకరణను పెద్దమొత్తంలో ప్రారంభించాలి. దేశవ్యాప్తంగా రైతు ఉత్పత్తి సంఘాల్లో చిరుధాన్యాల సాగుదారులను భాగస్వాములను చేసి, విక్రయాలతోపాటు ప్రాసెసింగ్ అవకాశాలు కల్పించాలి. చిరుధాన్యాల సాగులో యాంత్రీకరణ ఇబ్బందులు ప్రధానంగా ఉన్నాయి. నేటికీ సరైన కోత యంత్రాలు రాలేదు.