ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / offbeat

శ్రీకాకుళం స్పెషల్​ స్వీట్​ "ధనుర్మాస చిక్కీలు" - కేవలం ఈ సీజన్​లోనే లభిస్తాయి! - DHANURMASAM CHIKKILU

-ఉత్తరాంధ్ర ప్రత్యేకం ధనుర్మాస చిక్కీలు -పెళ్లిళ్ల సారెలు ఈ చిక్కీలు తప్పనిసరి!

Dhanurmasam Special Sweet Chikkilu
Dhanurmasam Special Sweet Chikkilu (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 15, 2025, 4:46 PM IST

Dhanurmasam Special Sweet Chikkilu :ప్రతి ప్రాంతానికీ దాని ప్రత్యేకతను చాటిచెప్పే వంటకం ఒకటుంటుంది. పూతరేకులు, మడత కాజాలంటే గోదావరి జిల్లాలు మదిలో మెదులుతాయి. రాగి సంగటి అనగానే రాయలసీమ మనందరకీ గుర్తుకొస్తుంది. అలాగే ఉత్తరాంధ్ర ప్రత్యేకతను చాటిచెప్పే వంటకం కూడా ఒకటుంది. అదే "ధనుర్మాస చిక్కీలు". కేవలం ధనుర్మాసంలో మాత్రమే లభించే ఈ స్వీటు కోసం ఉత్తరాంధ్ర వాసులు ఏడాదంతా ఎదురుచూస్తారు. ఇంతకీ ఉత్తరాంధ్ర స్పెషల్​ ధనుర్మాస చిక్కీల ప్రత్యేకత ఏంటో ఇప్పుడు చూద్దాం.

సంప్రదాయంగా :

తెలుగు రాష్ట్రాల్లో అమ్మాయిని ఇంటికి లక్ష్మీదేవిగా భావిస్తారు. అందుకే తమ ఇంటి ఆడపిల్ల ఎక్కడున్నా పెద్ద పండుగైన సంక్రాంతికి ఇంటికి పిలుచుకుంటారు. అలా వచ్చిన ఆడపిల్లపై తమ అభిమానాన్ని ఒక్కొక్కరూ ఒక్కో రకంగా చాటుకుంటారు. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో అమ్మమ్మ ఇంట్లో ఆడపిల్లకూ, మనుమరాళ్లకూ గాజులు పెడతారు. కొత్తబట్టలు పెట్టి, స్వీట్​ తినిపిస్తారు. అయితే, ఇలాంటి సంప్రదాయం ఉత్తరాంధ్రలో కూడా ఉంది. సంక్రాంతికి వచ్చిన ఆడపిల్లలకు ధనుర్మువ్వలు (ధనుర్మాస చిక్కీలు) ఇస్తారు. కేవలం ధనుర్మాసంలో మాత్రమే ఈ స్వీటు చేస్తారు కాబట్టి దీనికా పేరు వచ్చింది.

కొత్త ఏడాదిలో వచ్చిన ధాన్యంతో నెయ్యిలు(మురీలు) చేస్తారు. ఆపై నెయ్యి, కొబ్బరి, యాలకులు, వాము, సోంపు, మిరియాలు ఇవన్నీ కలిపి చిక్కీలుగా చేస్తారు. చిక్కీలు అందంగా కనిపించడానికి చెర్రీలు, జీడిపప్పు వంటివి అంటిస్తారు.

జగన్నాథ స్వామికి నైవేద్యంగా :

ధనుర్మాస చిక్కీలను నెయ్యి, మువ్వ అచ్చులు అని కూడా అంటారు. ఈ చిక్కీలను దేశంలోనే పేరుగాంచిన ఒడిశాలోని పూరి జగన్నాథ స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు. అయితే, మొదట ధనుర్మాస చిక్కీలను ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా చేసేవారట. కాలక్రమంలో వారు శ్రీకాకుళానికి వలస రావడంతో ఇక్కడా చిక్కీలకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సీజన్​లో ఉత్తారంధ్రలోని విజయనగరం, శ్రీకాకుళంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా వీటిని విక్రయిస్తారు. పెండ్లిళ్లలో పెట్టే సారెలో ఇవి కచ్చితంగా ఉంటాయి.

'చలికాలంలో వాతావరణం చల్లగా ఉండడంతో ఈ చిక్కీలు గట్టిగా ఉంటాయి. ఎండాకాలంలో మెత్తగా మారతాయి. చిక్కీలు ఎంత క్రిస్పీగా ఉంటే, అంత టేస్టీగా ఉంటాయి. కాబట్టి, వీటిని ఈ సీజన్​లోనే తయారు చేస్తాం' అని నిర్వాహకులు చెబుతున్నారు.

వీటిని మొదట దేవుడికి నివేదించి, పండుగకు వచ్చిన ఆడపిల్లలకు ఇస్తారు. కొందరు పొలంలో పనులు చేయడానికి వచ్చిన వారికి సంక్రాంతి పండగ సందర్భంగా ధాన్యంతోపాటూ వీటిని అందిస్తారు. అలా చేస్తే ఇంట్లో సిరిసంపదలకు కొదవ ఉండదని వారి విశ్వాసం. అయితే, కూతుళ్లు లేనివాళ్లు కోడళ్లకు ధనుర్మాస చిక్కీలను ఇస్తారట.

టెకీ వినూత్న ప్రయోగం - ఆకట్టుకునే రీతిలో శ్రీరామ మంత్రం

వైభవంగా ప్రభల తీర్థం- 170 చోట్ల ఉత్సవాలకు ఏర్పాట్లు

ABOUT THE AUTHOR

...view details