తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

మైదాపిండి చెగోడీలు ఆరోగ్యానికి హానికరం - ఇలా బియ్యప్పిండితో చేస్తే హెల్దీ అండ్ టేస్టీ! - HOW TO MAKE RICE FLOUR CHEGODILU

- ఇంట్లోనే స్వీట్​ షాప్​ స్టైల్​ చెగోడీలు - ఇలా చేస్తే కరకరలాడుతూ టేస్ట్​ అద్దిరిపోతాయి

How to Make Rice Flour Chegodilu
How to Make Rice Flour Chegodilu (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 3, 2025, 4:49 PM IST

How to Make Rice Flour Chegodilu:చెగోడీలు.. ఈ పేరు తెలియని తెలుగు వారు ఉండరేమో. పిల్లల స్నాక్స్​ కోసం, తినాలనిపించినప్పుడు, ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు, పండగల సమయాల్లో వీటిని ప్రిపేర్​ చేసుకుని తింటుంటారు. చేయడం రాని వారు బయట షాపుల్లో కొనుక్కుంటారు. అయితే.. సాధారణంగా ఇంట్లో చేసినా, బయట మార్కెట్లో కొన్నా.. అవి మైదా పిండితో చేసినవే ఎక్కువగా ఉంటాయి. కానీ.. మైదా పిండి మన ఆరోగ్యానికి ఎంత హాని చేస్తుందో తెలిసిందే. అందుకే మీకోసం బియ్యప్పిండి చెగోడీలు తీసుకొచ్చాం. ఇవి టేస్ట్​లో స్వీట్​ షాప్​ స్టైల్​ను మించి ఉంటాయి. మరి, లేట్​ చేయకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్​ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు:

  • బియ్యప్పిండి - 2 కప్పులు లేదా పావు కేజీ
  • శనగపిండి - 2 టేబుల్​ స్పూన్లు
  • పెసరపప్పు - 2 టేబుల్​ స్పూన్లు
  • నీళ్లు - 2 కప్పులు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • కారం - 1 టీ స్పూన్​
  • వాము - 1 టీ స్పూన్​
  • బేకింగ్​ సోడా - పావు టీ స్పూన్​
  • నూనె లేదా బటర్​ - 2 టేబుల్​ స్పూన్లు
  • నూనె - డీప్​ ఫ్రైకి సరిపడా

తయారీ విధానం:

  • ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టుకోవాలి. బియ్యం పూర్తిగా ఆరిన తర్వాత పిండి పట్టించుకుని తీసుకోవాలి.
  • ఆ పిండిలో నుంచి రెండు కప్పులు పిండి తీసి ఓ ప్లేట్​లోకి వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి శనగపిండి వేసి కలిపి పక్కన ఉంచాలి.
  • ఆ తర్వాత పెసరపప్పును శుభ్రంగా కడిగి ఓ అరగంట సేపు నానబెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో.. అదే కప్పుతో రెండు కప్పుల నీరు పాన్​లో పోసుకోవాలి.
  • అలాగే అందులోకి నానబెట్టిన పెసరపప్పును నీళ్లు లేకుండా వేసి కలపాలి.
  • ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం, వాము, బేకింగ్​ సోడా, నూనె లేదా బటర్​ వేసి బాగా కలిపి మరిగించుకోవాలి.
  • నీరు మరగడం స్టార్ట్​ అయినప్పుడు అందులోకి బియ్యం పిండి వేసి స్టవ్​ ఆఫ్​ చేసి బాగా కలుపుకోవాలి.
  • అనంతరం మూత పెట్టి చల్లారే వరకు ఓ 15 నిమిషాలు పక్కన ఉంచాలి.
  • గోరువెచ్చగా ఉన్నప్పుడు పిండిని బాగా కలుపుతూ ముద్దలాగా చేసుకోవాలి. ఒకవేళ పిండి కలిపేటప్పుడు పొడిపొడిగా ఉంటే చేతికి తడి చేసుకుని కలుపుకుంటూ పిండి మెత్తగా వస్తుంది.
  • ఇలా కలుపుకున్న పిండిలో నుంచి కొద్దిగా తీసుకోవాలి. మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టాలి.
  • ఇప్పుడు ముందుగా తీసుకున్న ఉండను ఏదైనా టేబుల్​ లేదా చపాతీ పీట మీద పెట్టి అరచేతితో నలుపుతూ ఒకే సైజ్​లో పొడుగ్గా చేసుకోవాలి.
  • అలా పొడుగ్గా చేసుకున్న తర్వాత దాన్ని చేతి వేలుకుని చుట్టుకుని చెగోడీలు షేప్​లో చేసుకుని రెండు అంచులను ఊడిపోకుండా అతికించాలి.
  • ఇలా చేసిన చెగోడీలను ఓ ప్లేట్​లోకి తీసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని చెగోడీలుగా చేసుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి కడాయి పెట్టి డీప్​ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి.
  • నూనె వేడెక్కిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్​లో పెట్టి ముందుగానే చేసుకున్న చెగోడీలను వేసి ఓ రెండు నిమిషాల వరకు కదపకుండా ఫ్రై చేసి.. ఆ తర్వాత గరిటెతో నిదానంగా రెండు వైపులా కలుపుతూ గోల్డెన్​ కలర్​ వచ్చే వరకు ఫ్రై చేసి ఓ ప్లేట్​లోకి తీసుకోవాలి.
  • అంతే.. కరకరలాడుతూ సూపర్​ టేస్టీగా ఉండే బియ్యప్పిండి చెగోడీలు రెడీ.
  • నచ్చితే మీరూ ఇవి తయారు చేసి మీ పిల్లలకు తినిపించండి.

ABOUT THE AUTHOR

...view details