Tips to Grow Spring Onions at Home:వంటకాలకు చక్కటి అరోమా, సూప్స్కి చక్కటి రుచి, కూరలకు గార్నిష్, ఇలా అన్నింటికీ స్ప్రింగ్ ఆనియన్స్ ఉండాల్సిందే. అందుకే చాలా మంది వీటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే ఇవి కావాలంటే కూరగాయల మార్కెట్కు వెళ్లాల్సిందే. కాగా, ఇకపై ఆ అవసరం లేకుండా కొన్ని టిప్స్ పాటిస్తే వీటిని వంటింటి బాల్కనీలోనూ సులువుగా పెంచుకోవచ్చు. మరి ఆ విధానం ఈ స్టోరీలో చూద్దాం.
ఉల్లికాడలు, ఉల్లికోళ్లు, ఉల్లిపరక, గ్రీన్ ఆనియన్స్, ఇలా ఒక్కటేమిటీ స్ప్రింగ్ ఆనియన్స్‌కి చాలా పేర్లే ఉన్నాయి. ఇది ఉల్లిపాయగా మారకముందే కత్తిరించి కూరల్లో వాడతారు. రుచిలో సాధారణ ఉల్లిపాయలకంటే కాస్త ఘాటు తక్కువగా ఉంటాయి. మెసపొటేమియా కాలం నాడే, ఉల్లికాడల్ని వాడిన ఆధారాలూ దొరికాయట. ఈ పోషకాల ఉల్లి పొరకను చైనా, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా వంటి తూర్పు ఆసియా దేశాల వంటకాల్లో ఎక్కువ వాడతారట. చైనీయులు సుమారు 2000 ఏళ్ల క్రితం నాటి నుంచే వీటిని వాడుతున్నారట.
ఈ టిప్స్ పాటిస్తే ఇంట్లోనే పెంచుకోవచ్చు:
- ఉల్లికాడల్ని పెంచుకోవడం సులువే. ముందుగా మట్టి తవ్వి అందులో ఉల్లిపాయల్ని పెట్టాలి. అయితే ఉల్లిపాయల్ని నాటేటప్పుడు ఒక్కొక్కదానికి కనీసం 4-6 సెం.మీ.ల దూరం ఉండేలా చూసుకోవాలి.
- నేలలోనే కాదు కుండీల్లోనూ, నీళ్లలోనూ పెంచుకోవచ్చు. ముఖ్యంగా నీరు నిలవని సారవంతమైన మట్టిలో నాటుకోవాలి.
- ఆకుల్ని మాత్రం తడపకూడదు. నీళ్లు తక్కువైతే ఆకులు పెళుసుగా మారతాయి. ఎక్కువైతే రంగు మారి వాలిపోతాయి. లక్షణాలను గమనించి జాగ్రత్తలు తీసుకోవాలి.
- ఇక, వీటికి పూర్తి సూర్యకాంతి అవసరం. మొక్క మొలకెత్తిన కొన్ని రోజులపాటు నైట్రోజన్ ఎక్కువగా ఉండే ఎరువుని అందిస్తే సరిపోతుంది.
- ఇక, ఉల్లికాడల్ని పెంచేటప్పుడు కలుపు మొక్కలు బాగా పెరుగుతాయి. వీటిని ఎప్పటికప్పుడు తీసేయాలి.
- మొక్క చుట్టూ ఉన్న మట్టిని వదులుగా చేయాలి. దీనివల్ల వేర్లకు తగినంత గాలి అందుతుంది.
- వేర్లతో సహా తొలిచేయకుండా కేవలం ఆకుల వరకూ కత్తిరించుకుంటే మళ్లీ చిగురొస్తుంది.