Ash Gourd Juice Health Benefits:చాలా మందికి క్యారెట్, బీట్రూట్, కీరదోస వంటి వివిధ రకాల జ్యూస్‌లు తాగడం అలవాటుగా ఉంటుంది. ఈ జ్యూస్‌లలో క్యాలరీలు తక్కువగా ఉండడంతో పాటు, ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల విటమిన్లు, మినరల్స్, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులంటున్నారు. అయితే, మెజార్టీ జనాలకు ఈ జ్యూస్‌లు మాత్రమే బాగా తెలుసు. కానీ, వీటితో పాటు రోజూ బూడిద గుమ్మడికాయను ఆహారంలో చేర్చుకున్నా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చని మీకు తెలుసా ? ఏంటి నమ్మలేకున్నారా?.. మీరు విన్నది నిజమే. కేవలం మనం దిష్టి తీయడానికి.. ఇంటి ముందు వేలాడదీయడానికి వాడే బూడిద గుమ్మడికాయను డైలీ జ్యూస్ చేసుకుని తాగితే ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ జ్యూస్ తాగడం వల్ల మన శరీరంలో ఎటువంటి మార్పులు వస్తాయో ఇప్పుడు చూద్దాం.
బూడిద గుమ్మడికాయల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం, ఇనుము, పొటాషియం, జింక్ పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి వ్యాధుల బారిన పడకుండా మనల్ని కాపాడతాయి. ఇవి సాధారణంగా రెండు నుంచి మూడు నెలల పాటు నిల్వ ఉంటాయి.
వెయిట్ లాస్ :ఇటీవల కాలంలో చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. అయితే, ఊబకాయం ఉన్న వారు డైలీ ఒక్క గ్లాసు బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగడం వల్ల త్వరగా కొవ్వు కరిగిపోతుందని నిపుణులు అంటున్నారు.
2018లో "Journal of the American Dietetic Association"లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. బూడిద గుమ్మడి జ్యూస్ తాగిన వారు తక్కువ ఆహారం తీసుకున్నారని.. అలాగే వెయిట్ లాస్ అయినట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ రీసెర్చ్‌లో టెక్సాస్ A&M యూనివర్సిటికీ చెందిన న్యూట్రిషన్ ప్రొఫెసర్ 'డాక్టర్ సాలాస్-సలజార్' పాల్గొన్నారు.
మలబద్ధకం సమస్య తగ్గుతుంది :చాలా మంది మలబద్ధకం సమస్యతో బాధపడేవారు వివిధ మందులను వాడుతుంటారు. అయితే, ఈ సమస్య ఉన్న వారు బూడిద గుమ్మడి కాయ జ్యూస్ తాగడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుందని.. అంతే కాకుండా గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు కూడా తగ్గుతాయని సూచిస్తున్నారు.
ఆందోళన తగ్గుతుంది :ప్రస్తుత కాలంలో చాలా మంది చిన్న విషయాలకే ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్నారు. ఇలా తరచూ ఆందోళన చెందేవారు గుమ్మడికాయ జ్యూస్ తాగడం వల్ల టెన్షన్‌ని తగ్గించుకుని మానసికంగా ప్రశాంతంగా ఉండొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.