jungle safari Best places in india :గోవా వెళ్లాం, అరకు, వైజాగ్ తిరిగొచ్చాం, ఊటీ, కొడైకెనాల్ చూసొచ్చాం ఇంకేంటి! అని ప్రశ్నిస్తే జంగిల్ సఫారీకే ఎక్కుమ మంది ఓటేస్తున్నారు. అటవీ ప్రాంత పర్యటనలు, నేషనల్ పార్కుల సందర్శనకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో భారతదేశంలోని ప్రముఖ జంగిల్ సఫారీలు, వాటి వివరాలు ఓ సారి తెలుసుకుందాం. జంగిల్ సఫారీ ఒక అద్భుతమైన, మరపురాని అనుభవం. ప్రకృతి, జంతు ప్రేమికులైతే కచ్చితంగా జంగిల్ సఫారీని ఆస్వాదించవచ్చు.
అడవి అందాలను ఆస్వాదించండి!
ప్రపంచంలోని అన్ని రకాల వాతావరణ పరిస్థితులు భారతదేశంలో కనిపిస్తాయి. ఉపఖండాన్ని తలపించే మన దేశంలో విభిన్న వాతావరణం ఉంటుంది. ఉష్ణ మండల, సమశీతోష్ణ పచ్చికబయళ్లతో పాటు గడ్డి భూములు కూడా ఉన్నాయి. దట్టమైన, అందమైన అడవుల్లో వన్య ప్రాణులు అనేకం నివసిస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో జంగిల్ సఫారీ చేయడం వల్ల ప్రకృతిని ఆస్వాదించడంతో పాటు వివిధ జంతువులను గమనించడం ద్వారా అద్భుతమైన జ్ఞాపకాలను పదిలం చేసుకోవచ్చు.
తిరుమలలోని ఈ పెయింటింగ్ ఏమిటో తెలుసా? - 90శాతం మంది భక్తులు ఫెయిల్!
రణతంబోర్ జాతీయ ఉద్యానవనం :
రాజస్థాన్‌లోని రణతంబోర్ జాతీయ ఉద్యానవనం భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధమైన టైగర్ రిజర్వ్‌లలో ఒకటి. పులులను చూడడానికి చక్కని అవకాశం. వన్య మృగాలతో పాటు వివిధ రకాల పక్షులు, జంతువులు కనిపిస్తాయి.
జిమ్ కార్బెట్ జాతీయ ఉద్యానవనం :
ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ జాతీయ ఉద్యానవనం దేశంలో అత్యంత పురాతనమైనది. ఇక్కడ పులులు, ఏనుగులు, మృగాలు, అనేక రకాల పక్షులు కనిపిస్తాయి. ఈ పార్క్ హిమాలయా పర్వతాల సానువుల్లో ఉంది.
బాంధవ్‌గఢ్ నేషనల్ పార్క్ :
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉమరియా జిల్లాలో ఉన్న బాంధవ్‌గఢ్ నేషనల్ పార్క్ పులుల రాజ్యంగా చెప్పుకోవచ్చు. దేశంలోని అత్యంత ప్రసిద్ధమైన జాతీయ ఉద్యానవనాలలో ఇదొకటి. పులుల సాంద్రత ఎక్కువగా ఉండడం దీని ప్రత్యేకత.
కజిరంగ నేషనల్ పార్క్ :
అస్సాం రాష్ట్రంలోని గోలాఘాట్, నాగావ్ జిల్లాల్లో ఉన్న కజిరంగ నేషనల్ పార్క్ ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. ఖడ్గ మృగాలు, నీటి గుర్రాలు, ఏనుగులు, పులులు ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. ఉద్యానవనంలో జీప్ సఫారీ చేస్తూ ఒంటి కొమ్ము ఖడ్గమృగాలను ఇతర జంతువులను చూడవచ్చు. ఏనుగు అంబారీపై కూర్చుని అడవిని చూడటం మరచిపోలేని ఆనందాన్నిస్తుంది.
పెరియార్ టైగర్ రిజర్వ్ :
కేళలోని పెరియార్ టైగర్ రిజర్వ్ అటవీ అందాలకు నిలయం. ఇడుక్కి, పతనంతిట్ట జిల్లాల్లో వ్యాపించి ఉన్న ఒక అద్భుతమైన జాతీయ ఉద్యానవనం. ఈ ప్రాంతంలో అందమైన ప్రకృతి దృశ్యాలు, వైవిధ్యమైన వన్యప్రాణులతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఏనుగుల మందలు, పులులకు ప్రసిద్ధి చెందింది.
నాగర్‌హోలె టైగర్ రిజర్వ్ :
కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్, కోడగు జిల్లాల్లో విస్తరించి ఉన్న అందమైన అడవి ప్రాంతం నాగర్‌హోలె టైగర్ రిజర్వ్. ఈ ప్రాంతంలో పులులు, ఏనుగులు, మృగాలు, అనేక రకాల పక్షులు నివసిస్తాయి. పులుల సాంద్రత ఎక్కువగా ఉండడంతో పాటు ఏనుగుల గుంపులు కనిపిస్తాయి.
గిర్ నేషనల్ పార్క్ :
ఆసియా సింహాలకు ఏకైక స్థావరంగా గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర ప్రాంతంలో ఉన్న గిర్ నేషనల్ పార్క్ నిలుస్తోంది. ప్రకృతి రమణీయ దృశ్యాలు, వైవిధ్యమైన వన్యప్రాణులు, చారిత్రక ప్రాముఖ్యత కారణంగా గిర్ అభయారణ్యం ప్రపంచ ప్రసిద్ధి చెందింది. సింహాలతో పాటు చిరుతలు, జింకలు, నీల్‌గాయలు, అనేక రకాల పక్షులు కనిపిస్తాయి. జీప్ సఫారీ చేస్తూ సింహాలు, ఇతర జంతువులను చూడొచ్చు. అందమైన ప్రకృతి దృశ్యాల మధ్య ట్రెక్కింగ్‌తో పాటు అద్భుతమైన ఫొటోలు తీయడానికి గిర్ నేషనల్ పార్క్ అనువైన ప్రదేశం.
కాన్హా జాతీయ ఉద్యానవనం :
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కాన్హా జాతీయ ఉద్యానవనం అతిపెద్ద జాతీయ ఉద్యానవనాలలో ఒకటి. ఇక్కడ పెద్ద పులులు, జింకలు, చిరుతలతో పాటు అనేక రకాల పక్షులు, అందమైన ప్రకృతి దృశ్యాలు వీక్షించవచ్చు.
సుందర్బన్స్ జాతీయ ఉద్యానవనం :
ప్రపంచంలోనే అతిపెద్ద మంగ్రోవ్ అడవి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సుందర్బన్స్ జాతీయ ఉద్యానవనం. రాయల్ బెంగాల్ టైగర్, గంగా డాల్ఫిన్‌తో పాటు అనేక రకాల పక్షులు కనిపిస్తాయి. బోట్ సఫారీ చేయడానికి సుందర్బన్స్ జాతీయ ఉద్యానవనం అనువైన ప్రదేశం.
పెంచ్ జాతీయ ఉద్యానవనం :
"జంగిల్ బుక్" నవలకు ప్రేరణ మధ్యప్రదేశ్‌లోని పెంచ్ జాతీయ ఉద్యానవనం. ఇక్కడ పెద్ద పులులు, చిరుతలు, జింకలతో పాటు అనేక రకాల పక్షులు కనిపిస్తాయి. పెంచ్ ఉద్యానవనంలో అందమైన నదులు, సరస్సులు కూడా ఉన్నాయి.
జంగిల్ సఫారీ చేసేటప్పుడు గమనించవలసిన విషయాలు :
- అభయారణ్యంలో పర్యటించేందుకు ఉదయం, సాయంత్రం అనువైన సమయాలు. పర్యటనలో సౌకర్యవంతమైన దుస్తులతో పాటు అనుకూలమైన షూ ధరించాలి.
- అటవీ జంతువులతో పాటు అందమైన ప్రకృతి దృశ్యాలను నిక్షిప్తం చేసుకునేలా కెమెరా వెంటపెట్టుకుని వెళ్లడం మంచిది.
- అడవి గురించి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు గైడ్ తప్పనిసరి.
శ్మశానాలు, బురద గుంతల్లో పెళ్లికూతుళ్లు! - ప్రీ వెడ్డింగ్ షూట్ పేరుతో వింత పోకడలు!
'తగ్గేదేలే'! - ఆ విషయంలో తెలంగాణను మించిపోయిన ఏపీ - దేశంలో నాలుగో స్థానం