90S KIDS SNACKS Allam murabba :90's కిడ్స్ ఎంతో ఇష్టంగా తిన్న పదార్థం అది. ఈ మధ్య మార్కెట్లోనూ పెద్దగా కనిపించడం లేదు. అల్లం, పంచదార, బెల్లంతో తయారయ్యే అల్లం మురబ్బా మీలో ఎవరికైనా గుర్తుందా?! కఫం, పైత్యం, జలుబు, దగ్గు, పైత్యం, వికారం, వాంతులు, గ్యాస్, గొంతు నొప్పి, మలబద్దకం ఇలా అన్ని సమస్యలకు సర్వరోగ నివారిణిగా పనిచేస్తుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
గుడ్లు లేకుండానే టేస్టీ 'ఎగ్ బుర్జీ'! - సింపుల్ టిప్స్‌తో ఇలా చేసేయండి
అల్లం మురబ్బా తయారీకి కావాల్సిన పదార్థాలు
- అల్లం - 100 గ్రాములు
- పంచదార - 200 గ్రాములు
- బెల్లం - 200 గ్రాములు
- నీళ్లు - 50 మి.లీ.
- ఉప్పు - చిటికెడు
- యాలకుల పొడి - పావు టీస్పూన్
- నెయ్యి - 1టీ స్పూన్
మొత్తంగా అల్లం, చక్కెర, బెల్లం అనేవి 1:2:2 నిష్పత్తిలో తీసుకోవాలి. ఒకవేళ చక్కెర తగ్గించుకుంటే అదనంగా బెల్లం 1:1:3 కలుపుకోవాలి. బెల్లం వద్దనుకుంటే పూర్తిగా చక్కెర తోనే తయారు చేసుకోవచ్చు. కానీ, బెల్లం ఎంతో ఆరోగ్యకరం.
తయారీ విధానం
- అల్లం శుభ్రంగా కడిగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దానిని మిక్సీ జార్ లోకి తీసుకుని మెత్తగా రుబ్బుకోవాలి.
- మెత్తగా రుబ్బుకున్న అల్లం పేస్ట్‌లోకి చక్కెర, బెల్లం కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి.
- 50ఎం.ఎల్ నీళ్లు కలుపుకుని మళ్లీ మిక్సీ పట్టాలి.
- ఆ తర్వాత బటర్ పేపర్ లేదా ప్లేట్ తీసుకుని నెయ్యి రాసుకోవాలి.
- పొయ్యిపై పాన్ పెట్టుకుని అల్లం, చక్కెర, బెల్లం మిశ్రమాన్ని పోసుకోవాలి.
- మంట లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని పాకం వచ్చే వరకు మరిగించాలి.
- అందులో చిటికెడు ఉప్పు, పావు టీస్పూన్ యాలకుల పొడి వేసుకుని కలుపుకోవాలి.
- బెల్లం, పంచదార కరిగిన తర్వాత మంట తగ్గించుకుని పాకాన్ని చెక్ చేసుకోవాలి.
- పాకం పూర్తిగా మరిగిన తర్వాత నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి పోసుకోవాలి.
- (ఆలస్యం చేస్తే అల్లం మురబ్బా పొడి పొడిగా మారిపోతుంది. పొడిగా మారిపోతే మళ్లీ కొద్దిగా నీళ్లు కలుపుకొని మరిగించుకుంటే సరిపోతుంది)
- నాలుగు మూలలున్న వెడల్పాటి బాక్స్‌లో పోసుకుంటే చక్కగా కట్ చేసుకోవచ్చు.
- పాకం కొంచెం చల్లారిన తర్వాత అచ్చుల కోసం పైపైన గాట్లు పెట్టుకోవాలి.
- ఓ గంట తర్వాత అల్లం మురబ్బా రెడీ అయినట్లే. గాట్లు పెట్టిన అచ్చులు విరగ్గొట్టి సీసాలో నిల్వ పెట్టుకోవచ్చు.
అల్లం ఆరోగ్య ప్రయోజనాలు
- అల్లం జీర్ణక్రియకు సహాయపడడంతో పాటు కడుపు నొప్పి, అజీర్తి, వికారం తగ్గిస్తుంది.
- రోగనిరోధక శక్తిని పెంపొందించే యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అల్లంలో పుష్కలంగా ఉన్నాయి.
- దగ్గు, జలుబు రుగ్మతలకు అల్లం సహజ నివారిణి. గొంతు నొప్పి, శ్వాసకోశ సమస్యలకు చక్కని పరిష్కారం.
- అల్లంలో నొప్పిని తగ్గించే గుణాలు కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులకు దివ్యౌషధం అని ఆయుర్వేద నిపుణులు చెప్తుంటారు.
- అధిక రక్తపోటును నియంత్రించడంతో పాటు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
- అల్లంలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయట. ముఖ్యంగా జింజెరాల్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణం ఆర్థరైటిస్, కండరాల నొప్పులతో పాటు నెలసరి సమస్యకూ చక్కని పరిష్కారం అని నిపుణులు సూచిస్తున్నారు.
- జింజర్‌లో మాంగనీస్, మెగ్నీషియం, కాపర్, బీ6 విటమిన్లు పుష్కలంగా ఉండడం వల్ల డైలీ డైట్లో భాగం చేసుకోవాలంటున్నారు.
- అల్లం వాడకంతో ఆర్థరైటిస్ నొప్పులు తగ్గడంతో పాటు కీళ్ల పనితీరు మెరుగుపడినట్లు 2001లో "రుమటాలజీ" అనే జర్నల్‌లో ప్రచురితమైంది.
NOTE :అల్లం మురబ్బా పూర్వ కాలం నుంచి వాడుకలో ఉన్నదే. ఏదైనా సరే అతిగా వాడడం అనారోగ్యమే. అల్లం వాడకంపై ఇక్కడ ఇచ్చిన ఆరోగ్య ప్రయోజనాలు మీ అవగాహన కోసం ఇచ్చినవే. శాస్త్ర పరిశోధనలు, జర్నల్స్ పరిశీలించి, పలువులు వైద్య నిపుణులను సంప్రదించి చేసిన సూచనలు మాత్రమే. వీటిని పాటించే ముందు మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.
గుంటూరు ఘాటుతో గోంగూర మటన్ - చూస్తేనే నోరూరిపోయేలా!
కేరళ స్టైల్లో కోడిగుడ్డు కర్రీ - కొబ్బరి పాల గ్రేవీతో సూపర్ టేస్ట్