Ice on Face for Skin :ముఖం అందంగా కనిపించాలని మనలో చాలా మంది రకరకాల చిట్కాలు పాటిస్తుంటారు. అందులో ముఖాన్ని ఐస్‌తో మర్దన చేసుకోవడం కూడా ఒకటి. అయితే, ఫేస్ గ్లోయింగ్‌గా కనిపించడానికి ఈ బ్యూటీ టిప్ నిజంగానే పని చేస్తుందా? ఇలా ముఖానికి ఐస్ రుద్దితే ఏమవుతుంది ? అందం కోసం ఇలాంటి చిట్కాలు పాటించడం మంచిదేనా ? అనే ప్రశ్నలకు ప్రముఖ సౌందర్య నిపుణురాలు 'డాక్టర్ శైలజ సూరపనేని' చెబుతున్నారు. ఆ వివరాలు మీ కోసం.
చైనీస్ బ్యూటీ టిప్ :ముఖానికి ఐస్ రుద్దితే మంచిదని తెలిపే శాస్త్రీయ ఆధారాలైతే ఏమీ అందుబాటులో లేవు. ఇలా ముఖానికి ఐస్ అప్లై చేసుకోవడం చైనీస్ స్కిన్‌కేర్‌లో ఒక భాగం! కాలంతో పాటు ఈ బ్యూటీ టిప్ మన దగ్గరికీ వచ్చింది. ఈ విధానాన్ని చాలా మంది ఎప్పటినుంచో ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా ఫేస్ ఉబ్బినా, కళ కోల్పోయినట్లుగా కనిపించినా ఈ టిప్ బాగా పనిచేస్తుంది.
ముఖానికి ఐస్‌తో మర్దన చేయడం వల్ల చర్మంలో రక్తప్రసరణ మెరుగవుతుందట. దీనివల్ల చర్మరంధ్రాలు తెరుచుకునిచర్మం బిగుతుగా అనిపిస్తుంది. అలాగే స్కిన్ కొద్దిగా నిగనిగలాడుతున్నట్లూ కనిపిస్తుంది. ముఖానికి ఐస్ రుద్దిన తర్వాత మేకప్ వేస్తే ఫేస్‌కి చక్కగా పట్టేస్తుంది. అందుకే ఎక్కువ మంది ఈ చిట్కా ఫాలో అవుతుంటారని డాక్టర్ శైలజ సూరపనేని చెబుతున్నారు.
ఈ చిట్కా ఫాలో అయ్యేవారు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. అవేంటంటే- అదే పనిగా నేరుగా ముఖానికి ఐస్‌తో మసాజ్ చేసుకోకూడదు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల చర్మం దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఫేస్‌కి ఐస్‌ని నేరుగా అప్లై చేయకుండా, ఒక శుభ్రమైన వస్త్రంలో చుట్టి, మృదువుగా వృత్తాకారంలో మసాజ్ చేసుకోవాలి. ముఖానికి ఐస్ పెట్టాక ఫేస్ పొడిబారుతుంది. కాబట్టి, మాయిశ్చరైజర్ తప్పకుండా ఉపయోగించాలి.