How Many Times Head Bath in a Week: కొంత మంది రోజూ స్నానం చేసే క్రమంలో తలస్నానం చేస్తుంటారు. మరికొంరికి జుట్టు కాస్త డల్‌గా, రఫ్‌గా కనిపించిన వెంటనే తలస్నానం చేయడం అలవాటు ఉంటుంది. మరి, ఇలా చేయడం మంచిదేనా? అసలు ఎన్ని రోజులకోసారి తలస్నానం చేయాలి? తలస్నానం చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లాంటి ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఎన్ని రోజులకోసారి చేస్తున్నారు?
వాతావరణ కాలుష్యం, దుమ్ము, ధూళి, పొగ లాంటి రకరకాల కారణాల వల్ల జుట్టు తొందరగా రఫ్‌గా, డల్‌గా మారిపోతుంది. దీంతో జుట్టు తిరిగి మృదువుగా, ఆరోగ్యంగా కనిపించాలని వెంటనే తలస్నానం చేసేస్తుంటాం. కానీ, అలా ఎన్నిరోజులకోసారి చేస్తున్నారో ఎప్పుడైనా గమనించారా? జుట్టు జిడ్డుగా ఉంటే నిపుణుల సలహా మేరకు రెండు రోజులకోసారి తలస్నానం చేయాలని.. ఒకవేళ మీది సాధారణ, పొడి జుట్టు అయితే వారానికి రెండుసార్లు మాత్రమే తలస్నానం చేయాల్సి ఉంటుందంటున్నారు. ఇలా ఎప్పుడు, ఎన్నిసార్లు చేసినా గాఢత తక్కువగా ఉండే షాంపూనే ఉపయోగించాలని సూచిస్తున్నారు.
తలస్నానానికీ పద్ధతుంది
తలస్నానం చేయాలనుకునే ముందుగా జుట్టు చిక్కులు తీసి బాగా దువ్వుకోవాలి. ఫలితంగా తలస్నానం చేసేటప్పుడు జుట్టు రాలడం కొంతవరకు తగ్గించుకోవచ్చు. అలాగే బిరుసుగా ఉన్న వెంట్రుకలు కూడా తెగిపోకుండా ఉంటాయి. ముందుగా నీళ్లతో జుట్టుని బాగా తడపాలని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు నీళ్లలో షాంపూను కలిపి.. ఈ మిశ్రమాన్ని తలపై పోసుకొని.. కుదుళ్లను రెండు నిమిషాల పాటు గుండ్రంగా రుద్దుతూ మసాజ్ చేయాలని తెలిపారు. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కుదుళ్లు బాగా శుభ్రపడి రక్తప్రసరణ బాగా జరుగుతుంది. జుట్టు రాలిపోయే సమస్య కూడా తగ్గుముఖం పడుతుందని చెబుతున్నారు.
గోరువెచ్చని నీరే!
ముఖ్యంగా తలస్నానం చేసేటప్పుడు మరీ చల్లని లేదా బాగా వేడిగా ఉండే నీళ్లను ఉపయోగించకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేస్తే కుదుళ్ల లోపల ఉండే సెబేషియస్ గ్రంథులు దెబ్బతింటాయని అంటున్నారు. ఫలితంగా ఆ ప్రాంతంలో జుట్టు పల్చగా అయిపోయి, తేమను కూడా కోల్పోతుందని తెలిపారు. అందుకే తలస్నానానికి ఉపయోగించే నీళ్లు మరీ చల్లగా కాకుండా, మరీ వేడిగా కాకుండా గోరు వెచ్చగా ఉండేలా చూసుకోవడం ఉత్తమమని సూచిస్తున్నారు.