Ukraine North Korean Soldiers Exchange Offer :రష్యా వైపు పోరాడుతున్న ఇద్దరు ఉత్తర కొరియా సైనికులను తమ ఆధీనంలోకి తీసుకున్నామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ శనివారం ప్రకటించారు. రష్యాలో బందీగా ఉన్న తమ సైనికులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలా చేస్తేనే ఉత్తర కొరియా సైనికులను కిమ్ జోంగ్ ఉన్‌కు అప్పగిస్తామని జెలెన్‌స్కీ తాజాగా కీలక ప్రకటన చేశారు.
'అలా చేస్తేనే బందీలను ఉత్తరకొరియాకు అప్పగిస్తాం'
"రష్యాలోని కుర్స్క్ ప్రాంతంలో ఇద్దరు ఉత్తర కొరియా సైనికులను మా ఆధీనంలోకి తీసుకున్నాం. ఉత్తర కొరియాకు చెందిన మరి కొంత మంది సైనికులను పట్టుకోవడానికి మా సైన్యం ప్రయత్నిస్తోంది. రష్యా వద్ద బందీలుగా ఉన్న ఉక్రెయిన్ సైనికులను విడుదల చేస్తేనే, మా అదుపులో ఉన్న ఉత్తర కొరియా సైనికులను ఆ దేశానికి అప్పగిస్తాం" అని జెలెన్‌స్కీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అంతేకాకుండా గాయాలతో చికిత్స పొందుతున్న ఉత్తర కొరియా సైనికుడితో మాట్లాడుతున్న వీడియోను విడుదల చేశారు. ఉక్రెయిన్ భద్రతా సర్వీస్ ఎస్‌బీయూ అధికారులు పట్టుబడిన ఉత్తరకొరియా సైనికుల గురించి పలు వివరాలు వెల్లడించారు. ఒక సైనికుడి దగ్గర ఎలాంటి ధ్రువపత్రం లేదని, మరో సైనికుడి వద్ద రష్యా మిలిటరీ కార్డు ఉందని పేర్కొన్నారు.
'భారీగా ఉత్తరకొరియా సైనికులు మృత్యువాత'
ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యాకు మద్దతుగా దాదాపు 10,000 మంది ఉత్తరకొరియా సైనికులు రంగంలోకి దిగారని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. కానీ దీనిపై రష్యా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు. రష్యా సైన్యం తరఫున యుద్ధంలో పాల్గొన్న ఉత్తరకొరియా సైనికులు కూడా భారీగా చనిపోయినట్లు ఇంతకుముందే జెలెన్‌స్కీ ప్రకటించారు. కాగా, అందులో వారి నిజమైన పేర్లు, వివరాలు మార్చేసి రష్యాకు చెందిన సైనికులుగా తప్పుడు పత్రాలు సృష్టించినట్లు గుర్తించామని వెల్లడించారు.